ఆ నలుగురు తప్ప అంతా అవుట్....?

Update: 2022-04-06 14:30 GMT
మొత్తానికి కొత్త మంత్రివర్గం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జగన్ ఢిల్లీ నుంచి రావడంతోనే నేరుగా రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. గవర్నర్ తో జగన్ కొత్త మంత్రి వర్గం విషయం మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ తేదీని  ఖరారు చేసుకుని ఉంటారని అంటున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అవుతోంది.

మరో వైపు చూస్తే జగన్ తప్ప మొత్తం 24 మంది మంత్రులను తీసుకోవాల్సి ఉంటుంది.  అయితే కొత్త మంత్రివర్గంలో కొత్త ముఖాలు ఇరవై మాత్రమే ఉంటాయని అంటున్నారు. అదే టైమ్ లో పాతవారిలో ఆ నలుగురిని కచ్చితంగా కొనసాగిస్తారు అని తెలుస్తోంది. వారు జగన్ కి అత్యంత సన్నిహితులు మాత్రమే కాదు, వారికి సరైన ఆల్టర్నేషన్ లేకపోవడం వల్లనే ఇలా చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే వైసీపీ క్యాబినేట్ లో అత్యంత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన జగన్ తండ్రి వైఎస్సార్ కి సమకాలీనుడు. ఆయనతోనే తన రాజకీయం స్టార్ట్ చేసి కొడుకుతో కలసి ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి జగన్ మనిషిగా ముద్రపడ్డారు.

ఆయనకు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దానికి కారణం జగన్  ముద్ర ఉండడమే. అలా నాటి నుంచి నేటి దాకా జగన్ వెన్నంటి నడచిన పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ పరంగా ప్రతీ ఆపరేషన్ ని సక్సెస్ చేసిన చరిత్ర ఆయనకు ఉంది.

దాంతో చంద్రబాబు చిత్తూరులో బలపడకుండా ఉండాలంటే పెద్దిరెడ్డినే ప్రయోగించాలి అన్నది జగన్ ఆలోచన. దాంతో పెద్దిరెడ్డి కంటిన్యూ అవుతారు అని అంటున్నారు. ఇక ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విషయమూ అంతే. ఆయన ఢిల్లీ టూ తాడేపల్లి గా చక్కర్లు కొడతారు.

ఆయన ఎన్నో ముడులు వేసి మరీ అప్పులు తెస్తున్నారు. ఆయనకు విపక్షాలు అప్పుల మంత్రి అని కూడా పేరు పెట్టాయి. ఆయనకు తెలిసిన ఆర్ధిక వ్యవహారాలు, చిక్కుముడులు విప్పదీయడాలు మరొకరిని ఆ పోస్టులో పెడితే ఇప్పటికి ఇప్పుడు చక్కబెట్టడం కష్టమన్న భావన ఉంది. దాంతో బుగ్గన తోనే మరో రెండేళ్ళు కధ నడపాల్సిన పరిస్థితి ఉంది.

ఇక మూడవ మంత్రి ఆదిమూలం సురేష్. ఈయనకు జగన్ కి చాలా సన్నిహితుడు. సామాజికవర్గం లెక్కలు ఇతరత్రా చూసుకున్నా ఆయన పోస్ట్ పదిలం అంటున్నారు. జగన్ ఈయనను మార్చేది లేదని నిర్ణయించుకున్నారు అంటున్నారు. ఇక క్రిష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని. ఈయన విషయం మీదనే అంతటా చర్చ సాగుతోంది. ఈయనకు పదవి ఉంటుందా లేదా అన్న దాని మీద టీడీపీ కూడా తెగ ఆసక్తిని చూపిస్తోంది.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఈయన పోస్ట్ కంటిన్యూ అవుతోంది అంటున్నారు. చంద్రబాబుని లోకేష్ ని ఆపాలంటే కొడాలి దూకుడే కరెక్ట్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇక ఆ సామాజికవర్గం నుంచి చూస్తే కొడాలి నాని కంటే ఎవరూ ఫైర్ బ్రాండ్ లేరరని అంటున్నారు. సో కొడాలి కత్తికి ఎదురులేదని చెప్పబోతున్నారు. ఇలా ఆ నలుగురు అయిదేళ్ళ మంత్రులు అవుతారు అని తెలుస్తోంది.
Tags:    

Similar News