ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం అంతకంతకూ ముదురుతోందే తప్పించి.. ముగియటం లేదు. తాము అలా ఎంట్రీ ఇచ్చినంతనే ఉక్రెయిన్ సైనికులు చేతులెత్తేస్తారని.. దీంతో ఉక్రెయిన్ తమ వశం అవుతుందన్న లెక్కల్లో ఉన్న రష్యాకు తాజా పరిణామాలు దిమ్మ తిరిగిపోతోంది. తాజా పరిణామాల్ని చూస్తుంటే.. యుద్ధం ఇప్పడిప్పుడే ముగిసే కళ కనిపించకపోవటమే కాదు.. ఉక్రెయిన్ కు మాత్రమే కాదు.. రష్యాకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందన్న భావన కలుగుతోంది.
ఇప్పటివరకు అగ్రరాజ్యంగా.. తన ప్రకటనలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగటం ద్వారా.. ఆ దేశాన్ని ఎవరెంత ఇబ్బంది పెట్టగలరో అంత ఇబ్బంది పెట్టేస్తున్నారు.
దీంతో.. ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్ ఆస్తుల ధ్వంసంతో చిగురుటాకులా వణికిపోతున్న దేశానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో రష్యా ఆర్థిక మూలాలు సైతం ఈ యుద్ధం కారణంగా కదిలిపోతున్నాయి. రేపొద్దున ఉక్రెయిన్ మీద రష్యా గెలిచినా.. దాని వల్ల ఒరిగే లాభం కంటే కూడా యుద్ధం కారణంగా ఎదురయ్యే నష్టం చేసే చేటు ఎక్కువగా ఉందంటున్నారు. కాల్పుల విరమణ వేళలోనూ రష్యా సైనికులు తొండి యుద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా చేత యుద్ధం ఆపించే శక్తి ప్రపంచంలో ఉన్నదెవరికి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం చెబుతున్నారు ప్రముఖ ఆర్థిక వేత్త స్టీఫెన్ రోచ్. ఆయన అంచనా ప్రకారం ప్రపంచంలో పుతిన్ మనసును మార్చే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి చైనా అధినేత జీ జిన్ పింగ్ గా చెబుతున్నారు.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి మధ్య బంధం అలాంటిదని ఆయన చెబుతున్నారు.
ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉందని..చైనా ఈ ఇష్యూలో ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్రిక్తతల్ని ఆపే శక్తి చైనా అధ్యక్షుడు ఒక్కడికి మాత్రమే ఉందన్నారు. ఆయన మాత్రమే పుతిన్ ను ప్రభావితం చేయగలరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా తాజాగా చైనా విదేశాంగ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
రష్యాతో తమ బంధం ఎంతో బలమైనదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఆ రెండు దేశాల మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామంటూ ఆఫర్ ఇవ్వటం గమనార్హం. ఇదే సమయంలో పశ్చిమ దేశాలు.. రష్యా మీద ఆంక్షల్ని విధించటాన్ని చైనా తప్పు పడుతోంది. ఇదంతా చూస్తే.. పుతిన్ ను ఆపే శక్తి ప్రపంచంలో చైనాకు మాత్రమే ఉందన్న విషయం స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.