ఆర్మీ కెప్టెన్ దురాగతం.. ఇలాంటోళ్లను ఏరేయాల్సిందే!!

Update: 2021-01-12 06:02 GMT
షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. ఇది విన్నంతనే ఇలాంటివి ఇంకెన్ని జరిగి ఉంటాయన్న సందేహం కలుగక మానదు. సరిహద్దుల్లో ప్రాణాల్ని లెక్క చేయక దేశ భద్రత కోసం త్యాగాలు చేసే ఆర్మీ జవాన్లు ఎందరో. అలాంటి తులసివనంలో గంజాయి మెక్కలాంటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవకే వస్తాడు భూపేందర్ సింగ్. ప్రభుత్వం ఇచ్చే రివార్డు సొమ్ముల కోసం ఆశ పడిన ఇతడు దారుణానికి పాల్పడ్డాడు. నిజానికి ఇలాంటి వారి కారణంగానే కశ్మీర్ లో అనవసరమైన కల్లోలాలకు కారణమవుతుంటుంది.

ఇంతకూ ఇతడు చేసిన దారుణం ఏమంటే.. ఉగ్రవాదుల్ని పట్టుకుంటే రివార్డుగా రూ.20లక్షల మొత్తం ఇస్తారు. దీని కోసం కక్కుర్తి పడిన భూపేందర్ నకిలీ ఎన్ కౌంటర్ లో ముగ్గురు అమాయకుల్ని చంపేశారు. ఈ దారుణానికి స్థానికులు సాయం చేసినట్లుగా గుర్తించారు. గత ఏడాది జులై 18న కశ్మీర్ లోని అంషిపొరాలో బూటకపు ఎన్ కౌంటర్ జరిగినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో సిట్ ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా.. భూపేందర్ సింగ్ చేసిన దారుణం బయటకు వచ్చింది.

300 పేజీల చార్జిషీట్ ను షోపియాన్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్  సికందర్ అజామ్ కు గత నెలలో ఇచ్చారు. ఇన్ ఫార్మర్లుగా పని చేస్తున్న నాజిర్.. అహ్మద్ లతో భూపేందర్ ఒక ప్లాన్ వేశారు. ఉగ్రవాదులు తిరుగుతుననారంటూ జవాన్లను తీసుకొచ్చి అంషిపొరాకు వెళ్లారు. నలుగురు జవాన్లు కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వారికి వినిపించింది. దీంతో అక్కడకు వెళ్లిన వారికి ముగ్గురు మృతులు కనిపించారు. వారిని గుర్తు పట్టకుండా చేసి.. ఆయుధాలు ఉంచాడు.

ఉగ్రవాదులకు సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. చివరకు వారు ఉగ్రవాదులు కాదని.. ఆపిల్ తోటలో పని చేసేందుకు వచ్చిన కూలీలుగా గుర్తించారు. తీవ్ర విమర్శలు.. ఆరోపణలు రావటంతో ఆర్మీ కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ చేసింది. దర్యాప్తులో భూపేందర్ సింగ్ దురాగతం బయటకు వచ్చింది.

రివార్డుగా ఇచ్చే రూ.20లక్షల కోసం ఇలాంటి పని చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆర్మీ ఉద్యోగులకు ఎలాంటి రివార్డులు ఉండవని.. అందరూ చెబుతున్నట్లుగా రూ.20లక్షల రివార్డు ఏమీ ఉండదని.. అలాంటి పద్దతి ఉండదని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారు చెప్పినట్లే రివార్డు లేదనే అనుకుందాం. మరి.. అమాయకుల్ని ఎందుకు కాల్చి చంపినట్లు? ఉగ్రవాదులుగా ఎందుకు చిత్రీకరించినట్లు? ఇలాంటి ప్రశ్నలతో పాటు.. భూపేందర్ సింగ్ తరహా అధికారులు ఇంకెంత మంది ఉన్నారన్న విషయం మీద కాస్త ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News