ఓవర్ యాక్షన్ కాస్తా మెడకు చుట్టుకుంది!

Update: 2017-07-30 15:41 GMT
ముద్రగడ పద్మనాభం చేయ తలపెట్టిన పాదయాత్ర విషయంలో ప్రభుత్వం చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంటోంది. ముద్రగడ పాదయాత్రను ఒక బూచిగా చూపించి.. గోదావరి జిల్లాల్లోని ప్రజలందరినీ కూడా ఒక రకమైన భయాందోళనలకు గురిచేయడంలోను, ముద్రగడ మీద వారిలో ఒక వ్యతిరేక భావం ఏర్పరచుకునేలా చేయడంలోనూ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అలాంటి వాటిలో భాగంగానే.. జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ ను విధించడం, ప్రజల జీవితాలను అగచాట్ల పాలు చేయడం, అందరినీ కూడా అనుమానితుల్లా చూస్తూ పదేపదే తనిఖీలు నిర్వహించడం వంటివి అన్నీ జరిగాయి. ఈ ప్రాసెస్ లో భాగంగానే.. ప్రభుత్వం పాదయాత్ర అనుకున్న 26వ తేదీన విద్యాసంస్థలు అన్నిటినీ కూడా బంద్ చేయించింది. సరిగ్గా ఈ నిర్ణయమే ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.

విద్యాసంస్థలను బంద్ చేయించే ఆదేశాలు ఇచ్చే హక్కు మీకెలా ఉంది. ఏ కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందో తెలియజేయాలంటూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయమూర్తి.. జిల్లా కలెక్టరుకు, ఎస్పీ కి నోటీసులు పంపడం వరకు వ్యవహారం ముదిరింది. పాదయాత్ర పేరు కింద.. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం దాదాపుగా కర్ఫ్యూ వాతావరణాన్ని నెలకొల్పింది. స్కూళ్లు పనిచేయకపోగా, కనీస పౌర సంచారం కూడా లేకుండా చేశారు. ఈ వ్యవహారాలపై న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రవణ్ కుమార్ సుమోటోగా కేసు స్వీకరించారు.

ఇలాంటి విషయాల్లో సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించినట్లుగా ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తున్నదని, ఇదంతా కోర్టు ధిక్కరణ కిందికి ఎందుకు రాదో తెలియజేయాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.

ముద్రగడ మీద ఎంత ఎక్కువగా బురద చల్లితే.. అంత ఎక్కువగా ప్రభుత్వానికి లాభం జరుగుతుందని చంద్రబాబు సర్కారు భావించిందన్నది స్పష్టం. అందుకోసమే.. ఆయనేదో పాదయాత్ర చేసుకోవాలని అనుకుంటే.. అక్కడికేదో జిల్లా అంతా అతలాకుతలం అయిపోతున్నట్లుగా , కర్ఫ్యూ  - యుద్ధ వాతావరణం సృష్టించి.. పాఠశాలలు కూడా మూయించి.. చాలా ఎక్స్ ట్రాలు చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి. న్యాయపీఠం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని అధికార్లకు కల్పిస్తున్నాయంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News