'సీబీఐ' లంచాల కేసుతో మోదీ ప్ర‌తిష్ట‌కు భంగం?

Update: 2018-10-23 13:51 GMT
2014లో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దేశంలో అవినీతి అంత‌మైపోయింద‌ని ఆ పార్టీ నేత‌లు గ‌ప్పాలు కొడుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోదీ హ‌యాంలో స్కామ్ లు జ‌ర‌గ‌డం లేద‌ని, పాల‌నంతా స‌జావుగా సాగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ, గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల‌తో మోదీ స‌ర్కార్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతోందని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. న‌ల్ల‌ధ‌నం పేరుతో నోట్ల ర‌ద్దు....జీఎస్టీతో సామాన్యుడి న‌డ్డి విరుపు....దేశ ర‌క్ష‌ణ‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ `రాఫెల్` లో రిల‌య‌న్స్ కు చోటు....వంటి ప‌రిణామాల‌తో మోదీ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డింది. మూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్లు.....తాజాగా మోదీ ప్ర‌భుత్వంపై `సీబీఐ`లంచాల బాగోతం కుదిపేస్తోంది. మోదీ ఇలాకాకు చెందిన సీబీఐ అధికారులు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌ల‌తో ఆ అత్యున్న‌త సంస్థ ప‌రువు బ‌జారున ప‌డేయ‌డం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

గ‌త 40 ఏళ్ల కాలంలో దేశాన్ని కాంగ్రెస్ భ్ర‌ష్టుప‌ట్టించింద‌ని, కానీ, మోదీ స‌ర్కార్ కు మాత్రం చాప‌కింద నీరులా 4 ఏళ్ల కాలంలోనే దేశ‌పు అత్యున్నత వ్యవస్థలను నిర్వీర్యం చేశార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌న సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన వ్య‌క్తుల‌ను ప‌లు అత్యున్న‌త సంస్థ‌ల‌లో నియ‌మించ‌డంపై కూడా దుమారం రేగుతోంది. తాజాగా, సోమవారంనాడు ఇద్దరు సీబీఐ డైరెక్టర్లు- అలోక్‌ వర్మ - రాకేశ్‌ అస్థానాలు ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిద్ద‌రికీ మోదీ క్లాస్ పీకిన‌ట్లు తెలుస్తోంది. గూఢచారి సంస్థ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఉన్నతాధికారికి కూడా ఆ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో, `రా` అధిపతి అనిల్‌ దస్మానాతోనూ మోదీ భేటీ అయ్యారు. అలోక్‌వర్మతో మోదీ భేటీ అయిన కొద్ది సేప‌టికే సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ అరెస్టు కావ‌డం విశేషం.

దీంతోపాటు, సీబీఐ ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొయిన్‌ ఖురేషీ మనీలాండరింగ్‌ కేసు చూస్తున్న సిట్ లోని అధికారుల చాంబర్లలో కూడా సోదాలు జరిగాయి. మ‌రోవైపు, అస్థానాను సస్పెండ్‌ చేయాలని అలోక్‌వర్మ వారం క్రిత‌మే ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, పీఎంఓ నుంచి ఆ స‌స్పెన్ష‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ట‌. ఇంత దుమారం రేగినా....అస్థానా పై  చర్యలు తీసుకునేందుకు మోడీ విముఖంగా ఉన్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. దీంతో, అస్థానాను సస్పెండ్ చేయ‌డం లేదా బదిలీపై పంప‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేంద్రం యోచిస్తోంద‌ట‌. ఏరికోరి తెచ్చుకున్న గుజ‌రాతీ అనుచ‌రుడు ఆస్థానా లంచాల బాగోతంలో చిక్కుకోవడంతో మోదీ ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆస్థానాపై ఏ చర్య‌లు తీసుకుంటారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News