సీబీఐ దర్యాప్తు సక్రమంగా సాగుతుందా ?

Update: 2022-06-10 06:30 GMT
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు మొదటినుండి అనేక మలుపులు తిరుగుతునే ఉంది. హత్యకేసులో కీలకంగా ఉన్న సాక్ష్యులు పరస్పర విరుద్ధంగా వ్యవహరించటం, ఇద్దరు సాక్ష్యులు మరణించటం, అనుమానితులుగా ప్రచారంలో ఉన్న కొందరిని సీబీఐ ఇప్పటివరకు విచారణ చేయకపోవటం, సీబీఐ అధికారులమీదే కొందరు ఫిర్యాదులు చేయటం, కోర్టులో కేసులు వేయటం లాంటి వాటితో సీబీఐ దర్యాప్తు సజావుగా సాగుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా అనంతపుం జిల్లాలోని యాడికి మండలంలో ఉంటున్న గంగాధరరెడ్డి అనే సాక్షి చనిపోయాడు. వివేకా హత్యలో అనుమానితులుగా ఉన్న నలుగురిలో దేవిరెడ్డి శివశంకరెడ్డి ఒకడు. ఈ దేవిరెడ్డికి గంగాధర్ ప్రధాన అనుచరుడు.

ఇతన్ని ఇప్పటికే సీబీఐ నాలుగుసార్లు విచారించింది. పైగా తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ గతంలోనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదుచేసున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందేమంటే గంగాధర్ ఇంట్లో నిద్రలోనే చనిపోయాడు.

ఇంట్లోకాకుండా బయట ఎక్కడైనా చనిపోయుంటే మీడియా మొత్తం గగ్గోలు పెట్టేస్తుందటనంలో సందేహంలేదు. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన గంగాధర్ ఉదయానికి లేవలేదని భార్య ఫరీదాభాను చెప్పారు. ఎప్పటినుండో హై బీపీ, హై షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన భార్య చెప్పారు.

గతంలో మరోసాక్షి కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి కూడా చనిపోయాడు. హత్యకేసులో కీలక సాక్షి, అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా తన ప్రాణాలకు హాని ఉందంటు మొత్తుకుంటున్న విషయం తెలిసిందే.

హత్యకేసులో కీలకంగా ఉన్న ఇద్దరు సాక్ష్యులు చనిపోవటం, మరికొందరు అడ్డం తిరగటం, ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నుండి అవసరమైన ఫోరెన్సిక్ నివేదికలు రావటంలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటం, చివరగా కేసును దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారులపైనే కొందరు సాక్ష్యులు రివర్సు కేసులు పెడుతుండటం లాంటివాటివల్ల దర్యాప్తు జరిగే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంతకాలం దర్యాప్తు జరిగినా కేసు ఒక కొలిక్కివస్తుందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News