డీజీపీ.. మంత్రి ఇళ్ల‌ల్లో సీబీఐ సోదాలు!

Update: 2018-09-05 10:30 GMT
ఒక డీజీపీ ర్యాంక్ అధికారి అంటే మాట‌లా?  ఒక రాష్ట్ర మంత్రి అంటే చ‌తుర్లా?  కానీ.. అదే సిత్ర‌మో కానీ దేశం లోని కొన్ని రాష్ట్రాల్లో చ‌ట్టం త‌న ప‌ని తాను నికార్సుగా ప‌ని చేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. మ‌రికొన్ని రాష్ట్రాల్లో ఏం జ‌రిగినా క‌ద‌లిక లేకుండా ఉండే వ్య‌వ‌స్థ‌లు మ‌రికొన్ని రాష్ట్రాల్లో మాత్రం త‌మ ప‌ని తీరుతో సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. తాజాగా అలాంటి ప‌రిస్థితే త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.

ఆ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గుట్కా స్కాంలో విచార‌ణ జ‌రుపుతున్న అధికారులు దాదాపు 40 చోట్ల దాడులు చేప‌ట్టారు. ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన దాడుల్లో 150 మంది అధికారులు పాల్గొన్నారు.

 షాకింగ్ విష‌యం ఏమంటే.. ఈ కేసులో సంబంధం ఉంద‌ని భావిస్తున్న త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖామంత్రి విజ‌య‌భాస్క‌ర్ తో పాటు.. డీజీపీ రాజేంద్ర‌న్.. మాజీ డీజీపీ జార్జ్ ఇళ్ల‌ల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 2017లో ఈ సంచ‌ల‌న కేసు వెలుగు చూసింది.

త‌మిళ‌నాడు ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు నిషేధిత గుట్కా త‌యారీ కేంద్రాల‌పై వ‌రుస దాడులు నిర్వ‌హించారు. గుట్కా వ్యాపారుల నుంచి మంత్రి విజ‌య్  భాస్క‌ర్ తో పాటు డీజీపీ ర్యాంకు అధికారికి.. ఆయ‌న కింది ప‌ని చేస్తున్న ప‌లు శాఖ‌ల అధికారుల‌కు దాదాపుగా రూ.40 కోట్ల ముడుపుల రూపంలో అందిన‌ట్లుగా చెబుతారు.

త‌మిళ‌నాడులో 2013 నుంచి గుట్కా.. పొగాకు ఉత్ప‌త్తుల‌పై నిషేధం ఉంది. ప్ర‌భుత్వ అధికారుల దృష్టి త‌మ మీద ప‌డ‌కుండా ఉండేందుకు భారీ ఎత్తున లంచం ఇచ్చి గుట్టుగా వ్యాపారాలు నిర్వ‌హిస్తుంటారు. ఈ స్కాంలో భాగంగా తాజాగా మంత్రితో పాటు ప‌లువురు ముఖ్య అధికారుల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హిస్తుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News