ఎస్పీవై ఇంట సీబీఐ సోదాలు..ఆ హెచ్చ‌రిక ఇచ్చేందుకేనా?

Update: 2019-04-29 06:50 GMT
ఏపీలో మ‌రోమారు సీబీఐ దాడులు క‌ల‌క‌లం సృష్టించాయి. కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ నేత‌ల నివాసాల్లో జ‌రిగిన దాడులు తాజాగా జ‌న‌సేన పార్టీ ఎంపీ అభ్య‌ర్థి నివాసంలో జ‌రిగాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ - జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. పలు కీలక పత్రాలు - కంప్యూటర్ హార్డ్‌ డిస్క్‌ లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎస్పీవై రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో నంది గ్రూపు పేరుతో పలు పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు - నిర్వహణ కోసం పలు బ్యాంకుల నుంచి ఎస్పీవై రెడ్డి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు నంది గ్రూపు సమర్పించిన ఆస్తి పత్రాలు నకిలీవని తేలినట్టు సమాచారం. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి నంద్యాలలోని ఎంపీ ఎస్పీవై రెడ్డి - ఆయన అల్లుడు నంది గ్రూపు ఎండీ సజ్జల శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి ఇళ్లు - నంది గ్రూపు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం నంద్యాల పట్టణంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఎస్పీవై రెడ్డి వరుసగా మూడుసార్లు నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో...జ‌న‌సేన‌లో చేరి ఎంపీగా పోటీ చేశారు. ఆరోగ్య స‌మ‌స్య‌కార‌ణంగా ఆయ‌న ఇటీవ‌ల హైద‌రాబాద్ కేర్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆస్ప‌త్రిలో ఉండ‌గానే ఈ సోదాలు జ‌రిగాయి. కాగా, ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం అవ‌స‌ర‌మైతే టీడీపీతో జ‌న‌సేన స‌న్నిహితంగా ఉండ‌నుంద‌నే వార్తల నేప‌థ్యంలో జ‌న‌సేనను హెచ్చ‌రించేందుకు ఈ దాడులు చేసిన‌ట్లుగా కొంద‌రు పేర్కొంటున్నారు. ఇదిలాఉండ‌గా - ఈ దాడుల‌పై ఇప్ప‌టివ‌ర‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించ‌లేదు.


Tags:    

Similar News