కేంద్రం దృష్టిలో కేసీఆర్‌ సీన్‌ ఏమిటి?

Update: 2015-06-12 04:26 GMT
ఓటుకు నోటు వ్యవహారంతో పాటు.. ఏపీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఏ దృక్ఫధంతో ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ కో.. హుటాహుటిన కేంద్రానికి వెళ్లి మోడీ సహా పలువురు నేతల్ని లుసుకొని రావటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర సర్కారు విషయంలో ఎలా వ్యవహరిస్తుంది? కష్టంలోఉన్న చంద్రబాబుకు అండగా నిలవాలని భావిస్తోందా? లేదా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రం తన మిత్రుడికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయాన్ని నమ్మలేమని.. నమ్మకస్తుడైన భాగస్వామిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న భావన వారిలో వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ను సుద్దపూసలా భావించలేమని.. అదే సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణ చేయటం కూడా సరికాదన్న వాదన చెబుతున్నారు. కేసీఆర్‌ ఏమీ సుద్దపూస మాత్రం కాదని.. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయాన్ని బయటకు లాగటం పెద్ద కష్టమైన పనిగా కేంద్రం భావించటం లేదు.

కేసీఆర్‌ ఎక్కడెక్కడ తన ప్రత్యర్థులపై నిఘా వేయించింది.. ఎవరెవరి ఫోన్లు బగ్గింగ్‌ చేయించిందీ తెలుసుకోవటం పెద్ద కష్టమైన పని కాదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌ విషయంలో అసలు విషయం తెలిసే వరకు చంద్రబాబుకు అండగా నిలవాలన్న భావనను వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కష్టంలో ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకుంటూనే.. కేసీఆర్‌ను పూర్తిగా విశ్వసించే అంశంలో కమలనాథులు కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News