విజ‌యసాయి ప్ర‌శ్న‌కు..కేంద్రం షాకింగ్‌ రిప్లై

Update: 2017-12-20 06:21 GMT
ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో షాకింగ్ వార్త చెప్పింది. ప్రత్యేక హోదా ప్రాతిపదికన రాష్ట్రాలకు సాయంచేసే ప్రక్రియ ప్రస్తుతం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ - జనరల్ కేటగిరీ ప్రాతిపదికన రాష్ట్రాలకు సాయం చేసే ప్రక్రియను పూర్తిగా రద్దు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 14వ ఆర్థిక సంఘం స్పెషల్ కేటగిరీని రద్దు చేసినప్పుడు, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు - పర్వత ప్రాంత రాష్ట్రాలకు ఆ హోదాను ఏ విధంగా కొనసాగిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సూటిగా జావాబివ్వకుండా సెప్టెంబరు 2016లో కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సహాయక చర్యలు జాబితాను వెల్లడించారు. కేంద్ర సహాయంతో నడిచే పథకాలను హేతుబద్ధంగా తీర్చదిద్దడానికి ముఖ్యమంత్రిలతో ఒక ఉపసంఘం ఏర్పాటైందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 2014నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ కు ఎంత మొత్తం నిధులను విడుదల చేశారన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ 2014-15 ఆర్థిక ఏడాది ఏర్పడిన వనరుల లోటును పూడ్చేందుకు ఇప్పటివరకు ఏపీకి రూ.3980 కోట్లు విడుదలయ్యాయని, దీనికి సంబందించి ఇంకా 138 కోట్లు ఏపీకి చెల్లించాల్సి ఉందని మంత్రి తెలిపారు.

ఇదిలాఉండ‌గా...రాజ్యసభలో కంపెనీల చట్టానికి సంబంధిచిన సవరణ బిల్లుపై చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కంపెనీల డైరెక్టర్ల తొలగింపుపై కేంద్రానికి కీలక సలహాలను ఇచ్చారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ అమలును పరిశీలించాలని విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రస్తావనలో లేవనేత్తారు. 2004 అమలులోకి వచ్చిన జాతీయ పెన్షన్ విధానం ప్రభుత్వం ఉద్యోగులకు అశనిపాతం అయిందని, కాలక్రమేణా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిమ్ తమ భవిష్యత్తుకు భద్రత - భరోసా కల్పించవన్న అసంతృప్తి ఉద్యోగులలో ఉందని వెల్లడించారు.

అలాగే ఏపీకి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి రూ.12191.78 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌ రాజ్ అహిర్ వెల్లడించారు. చట్టం ప్రకారం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు అనేక అంశాలను అందులో పొందుపరిచినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లోక్‌ సభ ఎంపీలు రామ్మోహన్ నాయుడు -శివప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ - తెలంగాణల్లో వివిధ విద్యా సంస్థల ఏర్పాటులో ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయితే కేంద్ర హోంశాఖ నోడల్ సంస్థగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ప్రధాన మంత్రి జనౌషది పరియోజన కేంద్రాలు ఏపీలో 125 - తెలంగాణలో 70 ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. విశాఖ ఎంపీ హరిబాబు లోక్‌ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మాన్సుబా ఎల్ మాండవియా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని  సెంట్రల్ రోడ్ ఫండ్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News