సీబీఐ కొత్త బాస్ మ‌న తెలుగోడే!

Update: 2018-10-24 05:21 GMT
అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కూ ఒక‌లా.. రాత్రి నుంచి పొద్దుపోయే మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో తెల్లారేస‌రికి.. కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. సీబీఐ బాస్‌.. డిప్యూటీ బాస్ ల మ‌ధ్య ర‌చ్చ చోటు చేసుకోవ‌టం.. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మేకాదు.. ప్ర‌ధాని మోడీకి త‌ల‌నొప్పులు తెచ్చేలా మార‌టంతో అసాధార‌ణ వేగంతో ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

వివాదానికి కార‌ణ‌మైన సీబీఐ బాస్ ల‌పై అన‌ధికార చ‌ర్య‌ల్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా సీబీఐ నూతన డైరెక్ట‌ర్ గా మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావును నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను ఆఘ‌మేఘాల మీద జారీ చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఒడిశా కేడ‌ర్ కు చెందిన నాగేశ్వ‌ర‌రావు తెలుగు వ్య‌క్తి కావ‌టం విశేషం. అప్పుడెప్పుడో విజ‌య‌రామారావు త‌ర్వాత సీబీఐ బాస్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలుగు వ్య‌క్తి నాగేశ్వ‌ర‌రావే కావ‌టం గ‌మ‌నార్హం. సీబీఐ ఉన్న‌తాధికారుల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల అనంత‌రం ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో సీబీఐ బాస్ కుర్చీలో తెలుగోడు కూర్చునే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పాలి.

మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. బుధ‌వారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల స‌మ‌యంలో సీబీఐ కొత్త బాస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అందుబాటులో ఉన్న అధికారుల‌తో హుటాహుటిన బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైనం నాట‌కీయంగా మారి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నాగేశ్వ‌ర‌రావు స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా మంగ‌పేట మండ‌లం బోరెన‌ర్సాపూర్ గ్రామం.

గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న ఆయ‌న ఇప్పుడు డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. సంచ‌ల‌న‌మైన అంశం ఏమంటే.. బుధ‌వారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల‌కు సీబీఐ బాస్ గా ఛార్జ్ తీసుకున్న నాగేశ్వ‌ర‌రావు.. తాను బాధ్య‌త‌ల్ని తీసుకున్న గంట‌ల వ్య‌వ‌ధిలోనే సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోదాలు నిర్వ‌హించారు. 10.. 11 అంత‌స్తుల్లోని అలోక్ వ‌ర్మ‌.. రాకేష్ అస్థానా గ‌దుల్ని త‌నిఖీ చేసి.. రెండు గ‌దుల్ని సీజ్ చేశారు. ఇక‌.. నాగేశ్వ‌ర‌రావు బ్యాక్ గ్రౌండ్‌కు వెళితే.. వ‌రంగ‌ల్ కు చెందిన ఆయ‌న‌..అదే జిల్లాలోని మంగ‌పేట యూపీఎస్ లో చ‌దువుకున్నారు. ఎనిమిది నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు తిమ్మంపేట జేడ్పీఎస్ ఎస్ లో చ‌దువుకున‌నారు.

వ‌రంగ‌ల్ ఏవీవీ కాలేజీ నుంచి ఇంట‌ర్‌.. వ‌రంగ‌ల్ దేశాయ్ పేట సీకేఎమ్ కాలేజీ నుంచి ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీలో డిగ్రీ చేశారు. ఉస్మానియా వ‌ర్సిటీలో పీజీ త‌ర్వాత పీహెచ్ డీ చేసే స‌మ‌యంలో సివిల్స్ ప్ర‌య‌త్నాలు చేశారు. 1986లో సివిల్స్ కు రాసి ఐపీఎస్ కు ఎన్నిక‌య్యారు.

ఒడిశా క్యాడ‌ర్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. ఎక్కువ‌గా ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ప‌ని చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల జేడీ బాధ్య‌త‌ల నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ త‌ప్పుకున్న త‌ర్వాత మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావు ఆ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ బాస్ గా మారారు. మిగిలిన లెక్క‌లు ఎన్ని ఉన్నా.. ఒక తెలుగోడు సీబీఐ బాస్ కావ‌టం తెలుగోళ్ల‌కు గ‌ర్వ‌కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News