సీఎంలు ఓకే అన్నాక కూడా స్టీఫెన్ ఫైల్ ఎందుకు ఆగింది?

Update: 2019-06-29 08:28 GMT
ఒక రాష్ట్ర కేడ‌ర్ కు చెందిన ఐపీఏఎస్ అధికారిని మ‌రో రాష్ట్ర కేడ‌ర్ కు బ‌దిలీ చేయ‌టం కాస్త క‌ష్ట‌మే అయినా.. రెండు రాష్ట్రాల మ‌ధ్య అంగీకారం ఉంటే పెద్ద ఇష్యూలు లేకుండా ఫైల్ ప్రాసెస్ అవుతుంది. అందుకు భిన్నమైన ప‌రిస్థితి తాజాగా నెల‌కొంది. తెలంగాణ కేడర్ లో ఐజీగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేయాల‌ని సీఎం జ‌గ‌న్ భావించారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని అడ‌గ‌టం.. ఆయ‌న ఓకే అన‌టం జ‌రిగిపోయాయి.

అయితే.. అనూహ్యంగా ఢిల్లీలో ఫైల్ కు కొర్రీ పెట్టి ఆపేశారు. అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల నియామ‌కాల వ్య‌వ‌హారాల్ని ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వ నేతృత్వంలో ఉండే డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ ట్రైనింగ్) కొర్రీ పెట్టి ఫైల్ ఆపేసింది.

రూల్ బుక్ ప్ర‌కారం ఒక రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి.. మ‌రో రాష్ట్రానికి డిప్యూటేష‌న్ మీద వెళ్లాలంటే స‌ద‌రు అధికారికి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కానీ.. కుటుంబ స‌మ‌స్య కానీ.. ఆరోగ్య స‌మ‌స్య లాంటివి ఉండాలి.స్టీఫెన్ విష‌యంలో అలాంటివేమీ లేవు. కేవ‌లం రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఓకే అని చెప్ప‌ట‌మే ఉంది. ఇలాంటివేళ‌లో కేంద్రంలో కొర్రీ పెట్ట‌టంతో.. ఇప్ప‌టికిప్పుడు స్టీఫెన్ ఫైల్ ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇంత‌కీ స్టీఫెన్ ర‌వీంద్ర‌ను జ‌గ‌న్ కోరుకున్నారంటే.. రాయ‌ల‌సీమ వ్య‌వ‌హారాల మీద అవ‌గాహ‌న ఎక్కువగా ఉండ‌ట‌మే కాదు.. త‌న తండ్రి వైఎస్ కు అత్యంత స‌న్నిహితుడిగా న‌మ్మ‌క‌స్తుడన్న‌పేరుంది. రాయ‌ల‌సీమ జిల్లాల్లో మీద ప‌ట్టు ఉండ‌ట‌మే కాదు.. విధి నిర్వ‌హ‌ణ‌లో క‌మిట్ మెంట్ చూపించే ఆయ‌న కోసం ఏపీ అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోరినంత‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓకే చెప్ప‌టం.. అందుకు సంబంధించిన ఫైల్ మీద సంత‌కం చేయ‌టం జ‌రిగిపోయాయి. అయితే.. ఈ ఫైల్ ఢిల్లీలో ఆగిపోయింది. వివ‌ర‌ణ‌పై సంతృప్తిక‌రంగా లేదు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రు ప్ర‌ధాని మోడీని వ్య‌క్తిగ‌త స్థాయిలో అడిగితే త‌ప్పించి ఈ ఫైల్ ముందుకెళ్ల‌లేని ప‌రిస్థితి ఉందంటున్నారు. మ‌రి.. ఒక సీనియ‌ర్ అధికారిని పంపే అంశంపై ప్ర‌ధానితో ఇద్ద‌రు సీఎంలు మాట్లాడే అవ‌కాశం ఉంటుందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఏమైనా.. కేంద్రం త‌న‌కు ప‌ట్టు ఉన్న అంశాల మీద త‌న‌దైన రీతిలో ప‌ట్టు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  


Tags:    

Similar News