ఈయనది కూడా రెండుకళ్ళ సిద్ధాంతమేనా ?

Update: 2021-08-14 07:30 GMT
‘సభా కార్యక్రమాల విషయంలో విపక్షాలు, అధికారపక్షం తనకు రెండుకళ్ళ లాంటవి’ ..ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన. సభా కార్యక్రమాలపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు వెంకయ్య పై విధంగా స్పందించారు. రెండు కళ్ళూ సరిగా ఉంటేనే చూపు సరిగా ఉంటుందని కొత్త సత్యాన్ని వెంకయ్య మీడియా మిత్రులకు బోధించారు. కాకపోతే వెంకయ్య చెప్పుకుంటున్నట్లు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని సక్రమంగా అమలు చేస్తున్నారా అన్నదే జనాలకు వస్తున్న సందేహం.

వెంకయ్య చెప్పిన రెండు కళ్ళ సిద్ధాంతం నిజమే అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలు, పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంపై రాజ్యసభలో చర్చకు ఎందుకు అనుమతించలేదు ? వర్షాకాల సమావేశాలు మొదటిరోజున మొదలైన ప్రతిపక్షాల గొడవతో చివరకు సమావేశాలు రెండు రోజుల ముందే ముగించేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగనుపుడు నిరవధికంగా వాయిదా వేయటం ఒకటే మార్గమని అందరికీ తెలిసిందే.

అయితే సభలో ప్రతిపక్షాలు ఎందుకని ఇంతగా రెండు అంశాలపై చర్చకు పట్టుబట్టినట్లు ? ఎందుకంటే పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు దేశంలోని వేలాదిమంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనేది ఆరోపణ. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని, ప్రధానమంత్రి నరేంద్రమోడి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటమంటే రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్చ, గోప్యతను కేంద్రప్రభుత్వం హరించటమే.

అందుకనే పెగాసస్ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మరి ఇంతటి కీలకమైన అంశంపై రాజ్యసభలో చర్చకు ఎందుకు అనుతించలేదు ? ప్రతిపక్షాల సందేహాలకు సమాధానం చెప్పాల్సిందేనని ప్రధానమంత్రిని వెంకయ్య ఎందుకు ఆదేశించలేకపోయారు ? సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిపక్షాల సభ్యులను నియంత్రించటానికే వెంకయ్య ప్రయత్నించిన విషయం లైవ్ టెలికాస్ట్ లో స్పష్టంగా అందరు చూసిందే.

ప్రతిపక్షాలు, అధికారపక్షం తనకు రెండు కళ్ళలాంటివని వెంకయ్య చెప్పటమే విచిత్రంగా ఉంది. ఆచరణలో చూపని ఇలాంటి సిద్ధాంతాలు చాలామంది చెబుతారు. రాష్ట్ర విభజనకు ముందు కూడా ఇలాంటి రెండుకళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబునాయుడు మొదటిసారి తెరమీదకు తెచ్చారు. చివరకు తన రెండుకళ్ళ సిద్ధాంతం మూలంగానే తెలగంణాలో టీడీపీ జెండానే పీకేసే పరిస్దితి తెచ్చుకున్నారు. కాబట్టి చెప్పుకోవటానికే రెండుకళ్ళ సిద్దాంతం పనికొస్తుంది ఆచరణలో కాదు.


Tags:    

Similar News