జ‌గ‌న్ అవినీతి..బాబు కామెంట్ల‌లో లాజిక్ లేదు

Update: 2017-11-11 08:22 GMT
నిందితుడు వేరు దోషి వేరు. అవినీతి వేరు. అవినీతి ఆరోప‌ణ‌లు వేరు. నిర్దార‌ణ అయిన త‌ర్వాత దోషిగా గుర్తించాల్సి ఉంటుంది..అప్ప‌టివ‌ర‌కు నిందితుడు మాత్ర‌మే. ఇది చాలా బేసిక్ అంశం. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ బేసిక్ పాయింట్ వ‌దిలేసి ఎక్క‌డెక్క‌డికో త‌న విశ్లేష‌ణ‌లు చేస్తున్నార‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు - త‌ట‌స్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు గురించి ఎందుకు అలాంటి మాట‌లు స‌ద‌రు వ్య‌క్తులు అనాల్సి వ‌చ్చిందంటే...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డిపై బాబు చేసిన కామెంట్ల వ‌ల్ల.

అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా త‌న‌తో భేటీ అయిన మీడియా ప్ర‌తినిధుల‌తో బాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కూడా స‌హ‌జంగానే జ‌గ‌న్‌పై బాబు విమ‌ర్శ‌లు చేశారు. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ‌ జీవితంలో జ‌గ‌న్ లాంటి నాయ‌కుడిని తానెప్పుడూ చూడ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాను అభివృద్ధి కోసం ముందుకు సాగుతుంటే...జ‌గ‌న్ రాష్ట్రంపై నెగ‌టివ్ ఇమేజ్ ప‌డేలా చేస్తున్నాడ‌ని బాబు దుయ్య‌బ‌ట్టారు. జ‌గన్ అవినీతిపై విదేశాల్లో కూడా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని బాబు చెప్పుకొచ్చారు.

అయితే ఈ కామెంట్ల‌పై ప‌లువురు భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ నేత గ‌మ‌నించాల్సిన మొద‌టి పాయింట్‌..జ‌గ‌న్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయే కానీ....అవి ఇంకా నిరూపితం కాలేద‌ని గుర్తు ఎర‌గాల‌ని చెప్తున్నారు. పైపెచ్చు `ఆర్థిన నేరాల అభియోగం` విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క న్యాయ‌స్థానం లేదా ద‌ర్యాప్తు వేదిక కూడా జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని తీర్పు వెలువ‌రించ‌లేద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ వ‌లే టీడీపీకి చెందిన నేత‌లు అందులోనూ బాబు స‌న్నిహితులుగా ముద్ర‌ప‌డిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - రాష్ట్రమంత్రి గంటా శ్రీ‌నివారావు - ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రుల‌పై భారీ స్థాయిలో ఆర్థిక - అవినీతి ఆరోప‌ణ‌లు ఉండ‌టంపై బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి వాస్త‌వ అంశాలు ఉండ‌గా...కేవ‌లం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకొని లేదా ఆయ‌న హ‌వాకు జ‌డుసుకొని ప‌దేప‌దే అవినీతి అంటూ ప్ర‌చారంలో మునిగితేలుతున్నార‌ని ప‌లువురు ఆక్షేపిస్తున్నారు.

కొస‌మెరుపుః జ‌గ‌న్ వ‌ల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బ‌తింటోంద‌ని, పెట్టుబ‌డులు రావ‌డం లేద‌ని ఆరోపిస్తున్న సీఎం చంద్ర‌బాబు మ‌రోవైపు పెద్ద ఎత్తున పార్ట్‌ న‌ర్ షిప్ స‌మ్మిట్లు ఏర్పాటు చేసి, భారీ స్థాయిలో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో వేల‌కోట్ల రూపాయల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ వ‌ల్ల ఏపీ అభివృద్ధి దెబ్బ‌తినడం క‌రెక్టా లేక‌పోతే...పెట్టుబ‌డుల విష‌యంలోనే మ‌త‌ల‌బు ఏదైనా ఉందా అనేది టీడీపీ పెద్ద‌లే ప్ర‌క‌టించాలి మ‌రి. 
Tags:    

Similar News