విశాఖలో పోలీసుల దూకుడుపై చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-10-28 11:30 GMT
టీడీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన 'సేవ్ ఉత్త‌రాంధ్ర‌' నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని పోలీసులు అడ్డుకోవ‌డంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం.. గృహ‌నిర్బంధాలు చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎంత అడ్డుకున్నా 'సేవ్ ఉత్తరాంధ్ర' నినాదం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణ, గంజాయి సాగు - అమ్మకాలు, అక్రమ మైనింగ్‌పై వైకాపా దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతామని చెప్పారు.

కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే తమ నేతలు పోరుబాట చేపట్టారని తెలిపారు. వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను అడ్డుకోవడాన్ని చంద్రబాబు ఖండించారు. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే తెదేపా పోరుబాటపై ప్రభుత్వం భయపడుతుందని చంద్రబాబు విమర్శించారు.
 
ఉత్తరాంధ్రలో వైసీపీ మార్క్ దోపిడీ, అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో కనీసం 10 పైసలు అభివృద్ది చేసినా టీడీపీ నేతల ఇంటి ముందు కాపలా కాసే ఖర్మ, సినిమా హాల్ కి వెళ్లి ఒక మహిళా నేతను అరెస్ట్ చెయ్యాల్సిన దుస్థితి  వచ్చేది కాదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష, ఇతర నేతలను నిర్బంధించడాన్ని చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైనట్లు స్పష్టమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీ బండారాన్ని బయటపెట్టేందుకు వస్తోన్న  నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గళాలపై జగన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News