చంద్ర‌బాబు.. విజ‌న‌రీ లీడ‌ర్ నుంచి వెట‌ర‌న్ లీడర్ అయ్యారా?

Update: 2021-05-24 10:30 GMT
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌న‌రీ లీడ‌ర్ నుంచి వెట‌ర‌న్ లీడ‌ర్ గా రూపాంత‌రం చెందారా? అన్న వాద‌న‌లు ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఇటీవ‌ల టీడీపీలో చోటుచేసుకున్న ప‌రిణామాలు ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ఉన్న స‌మ‌యంలో టీడీపీ అనుకూల మీడియా చంద్ర‌బాబును ఓ విజ‌న‌రీగా చిత్రీక‌రించింది. ఇందుకు ప‌లు వాద‌న‌ల‌ను వినిపించింది. వాటిలో కొన్ని నిజ‌మే అయినా.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత పుత్ర‌వాత్స‌ల్యంతో చంద్ర‌బాబు అనుస‌రించిన వ్యూహాల‌ను ప‌రిశీలిస్తే... చంద్ర‌బాబు నిజంగానే విజ‌న‌రీ నుంచి వెట‌ర‌న్ గా మారిపోయార‌ని చెప్ప‌క తప్ప‌దు.

త‌న మామ దివంగ‌త ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాగేసుకున్న త‌ర్వాత‌... టీడీపీ అనుకూల మీడియా విశ్వ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చంద్ర‌బాబును ఓ విజ‌న‌రీ నేత‌గా ప్ర‌చారం చేసింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఐటీని శ‌ర‌వేగంగా అభివృద్ది చేయ‌డంలో చంద్ర‌బాబు త‌న‌దైన శైలి కృషి చేశార‌ని, త‌త్ఫ‌లితంగానే రాష్ట్ర జీడీపీ ఓ రేంజిలో పెరిగిపోయింద‌ని కూడా ఆ మీడియా ప్ర‌చారం చేసింది. ఇందులో కొంతమేర వాస్త‌వం కూడా ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే... తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో హైద‌రాబాద్ లో కాంగ్రెస్ హ‌యాంలోనూ ఐటీ అభివృద్దికి పునాది ప‌డ‌గా... దానిని త‌న‌దైన శైలి స్పీడుతో ప‌రుగులు పెట్టించిన చంద్ర‌బాబు హైటెక్ సిటీ నిర్మించారు. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఐటీ సంస్థ‌లు హైద‌రాబాద్ లో త‌మ శాఖ‌ల‌ను ఏర్పాటు చేసేలా కృషి కూడా చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు బాగానే ప‌నిచేశార‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. ఫ‌లితంగానే ఉమ్మ‌డి రాష్ట్ర జీడీపీ బాగానే పెరిగింద‌ని కూడా చెప్పాలి. ఇదంతా తెలుగు నేల ఉమ్మ‌డిగా ఉన్నంత‌వ‌ర‌కేన‌ని చెప్పాలి.

అయితే ఎప్పుడైతే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో.. అప్పుడే చంద్ర‌బాబు త‌న విజ‌న‌రీని ప‌క్క‌న‌పెట్టేశార‌న్న వాద‌న‌లు వినిపించాయి. రాజ‌ధాని కూడా లేకుండా కొత్త‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన ఏపీని అభివృద్ధి చేయ‌డం అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబుతోనే సాధ్య‌ప‌డుతుంద‌న్న భావ‌న‌తో ఏపీ ప్ర‌జ‌లు టీడీపీకి ప‌ట్టం క‌డితే.. రాష్ట్ర అభివృద్ధిని అంత‌గా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు... త‌న కుమారుడు నారా లోకేశ్ ను ప్రొజెక్ట్ చేసే ప‌నిని భుజానికెత్తుకున్నారు. అప్ప‌టికే తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా, ప‌దేళ్ల పాటు విప‌క్ష నేత‌గా సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని క‌లిగిన చంద్ర‌బాబు.. పార్టీని త‌న త‌ర్వాత త‌న కుమారుడే న‌డ‌పాల‌న్న రీతిలో పావులు క‌దిపారు. ఈ క్ర‌మంలో త‌న కుమారుడు నారా లోకేశ్ ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇప్పించ‌డానికి బ‌దులుగా ప‌రోక్ష ఎన్నిక‌ల ద్వారా శాస‌న‌మండ‌లిలోకి ఎంట్రీ ఇప్పించేశారు. ఆ వెంట‌నే త‌న మంత్రివ‌ర్గంలోకి కుమారుడిని తీసుకున్న చంద్ర‌బాబు... లోకేశ్ కు కీల‌క శాఖ‌ల‌ను అప్ప‌గించారు.

ఆ త‌ర్వాత కూడా త‌న కుమారుడిలో తాను ఆశించిన మేర ఫ‌లితాలు రాబ‌ట్టే స‌త్తా లేద‌ని గ్ర‌హించినా కూడా... కుమారుడిని ప్ర‌యోజ‌కుడిగా నిలప‌డానికి బ‌దులుగా... ఎంత త్వ‌ర‌గా వీల‌యితే అంత త్వర‌గా త‌న కుమారుడికి ప‌ట్టాభిషేకం చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలో ప‌లు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకున్న చంద్ర‌బాబు... పార్టీని పెను ప్ర‌మాదంలో ప‌డేశారు. పార్టీ పురోభివృద్ధిపై దృష్టి సారించ‌డానికి బ‌దులుగా త‌న కుమారుడి పురోభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఓ వైపు పార్టీ క్ర‌మంగా కృశించిపోతున్నా కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. అంటే... త‌న‌లోని విజ‌న‌రీ నేత‌ను చంపేసిన చంద్ర‌బాబు... త‌న కుమారుడి ప‌ట్టాభిషేకాన్ని వీల‌యినంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావించే వెట‌ర‌న్ లీడ‌ర్ గా మారిపోయార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News