ఆ విషయంలో చంద్రబాబు కంటే కేసీఆర్‌ బెటర్‌!

Update: 2016-09-06 11:01 GMT
అసెంబ్లీ సమావేశాలు అంటే.. ప్రభుత్వాలు తమ నిర్ణయాల గురించి ప్రజాప్రతినిదులందరి దృష్టికి తీసుకువెళ్లి, చర్చించి, వారి ఆమోదం పొందవలసిన వేదికలు. అయితే ఇప్పటి ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాల పాత్రను మరీ దిగజార్చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడే రోజులు నిర్వహించాలని చూస్తోంటే ఈ అభిప్రాయమే కలుగుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు అనేవి.. ప్రభుత్వాలు అనుసరించే తప్పుడు పోకడల్ని ప్రతిపక్షాలు ముఖాముఖి నిలదీసే వేదికలు కూడా! అలాంటి నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటూ నిర్వహిస్తారు అనే సంగతి.. ఆయా ప్రభుత్వాల నిజాయితీ మరియు చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఈ కోణంలోంచి చూసినప్పుడు తక్కువ రోజులు సభలను నిర్వహించడం అనేది ప్రతిపక్షాల ధాటికి ప్రభుత్వం భయపడడానికి చిహ్నమా అనే అభిప్రాయం కూడా కలుగుతుంటుంది.

అలాంటి నేపథ్యంలో మన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిని గమనిస్తే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల విషయంలో చంద్రబాబునాయుడు కంటె కేసీఆర్‌ చాలా మెరుగ్గా కనిపిస్తున్నారు. కేసీఆర్‌ తొలుత జీఎస్టీ బిల్లును సత్వరం ఆమోదించడానికి గాను ఒక రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. అక్కడితో వర్షాకాల సమావేశాలను ముగిస్తారేమో అనుకున్నట్లుగా.. కనీసం 15 రోజుల పాటూ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటూ తెలుగుదేశం - కాంగ్రెస్‌ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సహజంగా సీఎం ఒప్పుకోరు కదా అనుకున్నారేమో గానీ.. కేసీఆర్‌ ఏమాత్రం తగ్గకుండా.. ఆ ఒక్కరోజు జీఎస్టీ సమావేశం పూర్తి కాగానే.. మూడో వారంలో పదిరోజుల పాటూ ఏకబిగిన సమావేశాలు పెట్టుకుందాం అన్ని ప్రజల సమస్యలనూ కూలంకషంగా చర్చిద్దాం అని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలకు ఇక వాయిస్‌ లేకుండా పోయింది.

అదే సమయంలో ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు మూడు రోజులే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 15రోజులు సభ ఉండాలని కోరిన తెలుగుదేశం పార్టీ, ఏపీలో 3 రోజుల పెట్టడం ఒక చిత్రం. అయితే.. ఇక్కడ కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కనీసం 15 రోజుల సభ ఉండాలంటూ కోరుతోంది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు సిద్దంగా లేరు. 15 రోజుల పాటూ కాదు కదా.. పదిరోజులైనా సరే.. వైకాపా ఎదురుదాడిని తట్టుకునే సామర్థ్యం తమకు లేనట్లుగా కేవలం మూడు రోజుల్లో ముగించాలని చూస్తున్నారన్నట్లుగా జనం భావిస్తున్నారు.

ఈ కోణంలోంచి చూసినప్పుడు.. మూడు రోజులు దాటి సభ పెట్టే ధైర్యం లేని చంద్రబాబు కంటే.. జీఎస్టీ కలిపి 11 రోజులు సభ పెట్టడానికి సిద్ధపడ్డ కేసీఆర్‌ చాలా బెటర్‌ కదా అని జనం అంటున్నారు.
Tags:    

Similar News