అందరిని గుంటూరుకు రావాలన్న చంద్రబాబు

Update: 2019-09-03 08:17 GMT
పని లేకున్నా.. క్షణం తీరిక లేకుండా ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు. రాజకీయాల్లో దేనికి స్పందించాలని.. దేనికి రియాక్ట్  కాకూడదన్న విషయంలో క్లారిటీ లేకుండా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో చంద్రబాబు మరోసారి తప్పు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల నుంచే రాజకీయాల్ని మొదలెట్టటం ద్వారా బాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని చెప్పాలి.

విపరీతమైన ప్రజాదరణతో.. చారిత్రక విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద విమర్శలు చేసే విషయంలో ఓర్పు.. సహనం అవసరం. ప్రతిదానికి యాగీ చేయటం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చన్న బాబు ప్లాన్ వర్క్ వుట్ కాదన్న విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారన్నది అర్థం కానిది. ఎందుకంటే.. కొన్ని అంశాలకు కాలమే సమాధానం చెబుతుంది.

అధికారం కోల్పోయిన చంద్రబాబు.. నిజంగా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే జగన్ తప్పుల మీద తప్పులు చేసే వరకూ వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రం పొలిటికల్ మైలేజీ పొందుతారు. అందుకు భిన్నంగా అయినదానికి కానిదానికి అదే పనిగా రియాక్ట్ అయితే.. తనకున్న కాసింత ఇమేజ్ ను కూడా కోల్పోతారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

గడిచిన మూడున్నర నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరాచకాలకు అంతే లేకుండా పోయిందని.. హత్యలు.. ఆత్మహత్యలు.. ఆస్తుల ధ్వంసం.. భూముల కబ్జాలు.. సామూహిక దాడులు.. వేధింపులు.. అక్రమ కేసులకు లెక్క లేదంటున్న ఆయన.. అలాంటి బాధితులంతా గుంటూరు రావాలంటూ పిలుపునిచ్చారు.
 
గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. బాధితులంతా గుంటూరు శిబిరానికి రావాలన్నారు. అవసరమైతే బాధితుల తరఫున తాను వారిని తీసుకొని గ్రామాలకు వెళతానని వ్యాఖ్యానించారు. వినేందుకు కొత్తగా ఉన్నప్పటికి.. ఇలాంటి వాటి కారణంగా మరింత ఉద్రికత్తలు పెరగటం ఖాయం. ఇలాంటి నిర్ణయాలతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి వెరైటీ ఐడియాలు బాబుకు ఎవరిస్తారో ఏమిటో?


Tags:    

Similar News