టిక్కెట్లు ఇచ్చేస్తా తన్నుకు చావండి..బాబు!

Update: 2018-12-19 15:53 GMT
నారా చంద్రబాబు కాపీ నాయుడు. ఇదేమిటి నారా చంద్రబాబు నాయుడు కదా.. కాపీ నాయుడు ఏమిటి అనుకుంటున్నారా. మీరు చదివింది నిజమే... తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎలాంటి ఎత్తుగడలు వ్యూహాలు రచించారో అమలు చేసారో తాను కూడా అలాంటి వ్యూహాలు ఎత్తుగడలను అమలు చేయాలని చంద్రబాబు నాయుడు రంగం సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు మూడు నెలల ముందే తెలుగుదేశం అభ్యర్దులను ప్రకటించాలని నిర్ణయించారట.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షడు కేసీఆర్ తమ పార్టీ అభ్యర్దులను మూడు నెలల ముందే ప్రకటించారు. ఇది కొంత వ్యతిరేకత వచ్చినా ఎన్నికల నాటికి సద్దుమణిగింది. పార్టీలో టిక్కెట్లు ఆశించిన నలుగురైదుగురు మినహా మిగిలిన వారంత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి పనిచేసారు. దీంతో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఘన విజయం దక్కింది. ఇదే ఫార్ములాను తాను కూడా పాటించి ముందుగానే అభ్యర్దులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం.

తెలంగాణలో ముందుగా అభ్యర్దులను ప్రకటించి కేసీఆర్ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ వ్యూహం బెడిసికొడుతుందంటున్నారు. దీనికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలలోను - పార్టీ కేడర్‌ లోను తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యేలలో సగానికి పైగా అభ్యర్దులను మార్చాలని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఆ అభ్యర్దులను మార్చి కొత్తవారికి టిక్కెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు - టిక్కెట్లు ఆశించిన ఇతర నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందంటున్నారు. పోనీ అని సిట్టింగ్‌ లకే టిక్కెట్లు ఇస్తే వారందరూ పరాజయం పాలవ్వడం ఖాయమని పార్టీ నాయకులే చెబుతున్నారు. దీంతో చంద్రబాబు నాయుడికి ముందు సిట్టింగుల నుయ్యి వెనుక ఆశావాహుల గొయ్యి పొంచి ఉందంటున్నారు. తెలంగాణ ఎన్నికలను - తెలంగాణ రాష్ట్ర సమితి ఎత్తుగడను మక్కికి మక్కి కాపీ కొడితే తెలుగుదేశం పార్టీ బొక్కబోర్ల పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ముందుస్తు టిక్కెట్ల గోల తాంబూలాలు ఇచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టు ఉందని అంటున్నారు.
Tags:    

Similar News