కలెక్టర్ మీద ఆ దూకుడేంది బాబు..?

Update: 2016-01-07 04:33 GMT
మంచితనమైనా హద్దులు దాటకూడదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేటట్లుగా ఈ మధ్యన కొందరు చేసిన వ్యాఖ్యల ప్రభావం బాబు మీద బాగానే కనిపిస్తోంది. పార్టీ నేతల మీదా.. అధికారుల మీదా ఆయన అంతులేని సానుకూలతను ప్రదర్శిస్తున్నారని.. ఆయన తీరుతో పాలనా రథాలు పక్కదారి పట్టాయని.. బాబు మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు చేయటం.. అలాంటి వ్యాఖ్యలకు భారీగా ప్రచారం లభించటంతో చంద్రబాబు చెలరేగిపోతున్నారు.

ఈ మధ్యన షురూ చేసిన జన్మభూమి కార్యక్రమంలో భాగంగా.. అధికారులపై ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. అధికారుల మీద బాబు గుస్సా ప్రజలకు సరికొత్త వినోదాన్ని అందిస్తోంది. బహిరంగ సభల్లో.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించే అధికారుల మీద తాట తీస్తనంటూ రంకెలు వేయటం కొందరికి విపరీతమైన సంతోషాన్ని కలిగించటమే కాదు.. అదికారుల మీద మరిన్ని పితూరీలు చెప్పేందుకు కారణమవుతోంది. ఇలాంటి వాటిని పట్టించుకోని బాబు.. అధికారుల మీద బహిరంగ సభల్లో ప్రజలు చేసే వ్యాఖ్యల దన్నుతో వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

ఈ దూకుడుపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ లోకి వచ్చిన తర్వాత అధికారుల పట్ల ఆచితూచి వ్యవహరించిన చంద్రబాబు ఈ మధ్యన చెలరేగిపోవటం వారికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. పట్టించుకోనంత కాలం అస్సలు పట్టనట్లుగా.. చాలా సున్నితంగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా దూకుడు వ్యాఖ్యలు చేయటం పలువురిని నొప్పిస్తోంది.

అధికారులపై విరుచుకుపడే ధోరణికి తాజా ఉదాహరణగా బాబు కర్నూలు జిల్లా పర్యటనను చెప్పొచ్చు. బనగానపల్లెలో జరిగిన ఒక కార్యక్రమంలో కలెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఏయ్ కలెక్టర్’’.. ‘‘నీకేగా చెప్పేది’’.. ‘నువ్వేగా చేయాల్సింది’’ లాంటి ఏక వచనంలో వ్యాఖ్యలు చేశారు. విషయం ఏదైనా ఐఏఎస్.. ఐపీఎస్ లాంటి అధికారుల విషయంలో మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.  కర్నూలు జిల్లాలోనే కాదు..రీసెంట్ గా జరిపిన కృష్ణా జిల్లా పర్యటనలో జేసీని ఉద్దేశించి ఇదే తీరులో వ్యాఖ్యానించటం గమనార్హం. తప్పు చేసిన వారిని నిలదీయటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో.. పెద్దా.. చిన్న అదికారులన్న తేడా లేకుండా నోటికి పని చెప్పటం నష్టమన్న విషయాన్ని బాబు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News