చిన‌బాబు-బాల‌య్య‌ల‌కు బాబు క్లాస్ పీకార‌ట‌!

Update: 2017-11-23 12:10 GMT
మ‌రో ఏడాదిన్న‌ర‌లో అసెంబ్లీతో పాటు పార్ల‌మెంటుకూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్ర‌చారం చేయించుకుని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఎలాగోలా అధికార ప‌గ్గాలు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర తీసి బ‌లంగా ఉన్న విప‌క్ష వైసీపీని బ‌ల‌హీనప‌రిచే ప్లాన్‌ను కూడా స‌క్సెస్‌గానే కానిచ్చేశారు. బాబు మంత్రం ఫ‌లితంగా 65 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉన్న వైసీపీ ఇప్పుడు 40 పై చిలుకుకే ప‌రిమిత‌మై పోయింది. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేస్తూనే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మ‌దింపు చేస్తున్న చంద్ర‌బాబు... గెలుపు అవ‌కాశాలు లేని నేత‌ల‌కు సీట్లిచ్చే ప్ర‌సక్తే లేద‌ని కూడా ముఖం మీదే చెప్పేస్తున్నారు. వెర‌సి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా గెలిచి తీరాల్సిందేన‌న్న భావ‌న‌ను ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ మ‌రింత జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో నంది అవార్డుల  వివాదం రేకెత్త‌డం... దానిపై ఎలా స్పందించాలో కూడా తెలియ‌ని వైనం నిజంగా టీడీపీ నేత‌ల‌కు పెద్ద చిక్కునే తెచ్చి పెట్టింద‌నే చెప్పాలి. నంది అవార్డుల‌న్నీ కేవ‌లం ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఇచ్చార‌ని, మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన న‌టుల‌కు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిపోయింద‌ని నేరుగా సినీ జ‌నాల నుంచే దూసుకువ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై చంద్ర‌బాబు చాలా ఆచితూచి స్పందించార‌నే చెప్పాలి. అయితే అవార్డుల్లో భాగంగా అగ్ర స్థానంలో నిలిచిన లెజెండ్ చిత్ర హీరోగా ఉన్న బాబు బావ‌మ‌రిది, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఈ అవార్డుల‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు. ఓ న‌టుడిగానే కాకుండా టాలీవుడ్‌లో ఓ ప్ర‌ముఖ వ్య‌క్తిగా ఉన్న బాల‌య్య స్పంద‌న‌ను అంత పెద్ద త‌ప్పుగా ప‌రిగ‌ణించ‌లేకున్నా కూడా... బాలయ్య వ్యాఖ్య‌లు బాబుకు కోపాన్ని తెప్పించాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే బాల‌య్య‌తో పాటుగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేశ్ ఈ అవార్డుల‌పై స్పందించిన తీరు కూడా బాబుకు కోపం తెప్పించింద‌ట‌. మంత్రిగానే కాకుండా త‌న త‌ర్వాత స్థానంలో ఉన్న వ్య‌క్తిగా లోకేశ్ ఆ త‌ర‌హాలో స్పందించి ఉండాల్సి కాద‌న్న‌ది బాబు వాద‌న‌. త‌న కుమారుడిగా లోకేశ్ నోట నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌ను కూడా మీడియా హైలెట్ చేస్తున్న నేప‌థ్యంలోనే బాబు ఈ త‌రహాలో స‌మాలోచ‌న చేశార‌ట. ఈ క్ర‌మంలో బాల‌య్య‌తో పాటు లోకేశ్ కు కూడా బాబు ఓ రేంజిలో క్లాస్ పీకిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల సారాంశంలోకి వెళితే... బాల‌య్య‌తో పాటు త‌న కుమారుడు లోకేశ్ నంది అవార్డుల‌పై స్పందించిన తీరు స‌రిగా లేద‌ని ఓ నిర్దార‌ణ‌కు వ‌చ్చిన బాబు... ఇటీవ‌ల వారిద్ద‌రికీ ఓ పెద్ద క్లాసే పీకార‌ట‌. అయినా నంది అవార్డుల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం నీకేమొచ్చింద‌న్న కోణంలో లోకేశ్‌కు త‌లంటిన చంద్ర‌బాబు... నిన్న‌టిదాకా న‌టుడిగానే ఉన్నా... ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారిన త‌రుణంలోనూ నోటిని అదుపులో పెట్టుకోక‌పోతే ఎలాగంటూ బాల‌య్య‌కు కూడా బాబు క్లాస్ పీకిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఆధార్ కార్డులు, ఓటు హ‌క్కు గురించి నీకెందుకొచ్చింద‌ని కూడా బాబు.. లోకేశ్ ను కాస్తంత గ‌ట్టిగానే దులిపేశార‌ట‌. ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే ఎలాగంటూ బాబు పీకిన్ క్లాస్‌తో బాల‌య్య‌, లోకేశ్ ఇద్ద‌రూ కంగు తిన్నార‌ట‌. ఆ త‌ర్వాత బాబు ఆవేద‌న‌లోనూ అర్థ‌ముంద‌ని గ్ర‌హించిన మామా అల్లుళ్లు ఇక‌నైనా కాస్తంత జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. సోష‌ల్ మీడియాలో వార్త‌లంటేనే... ఫక్తు ఊహాగానాల ఆధారంగానే కూడుకున్న‌వ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజముంద‌న్న అంశంపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News