అమరావతికి బ్రాండ్ అంబాసిడర్.. దేవాన్ష్

Update: 2016-12-28 06:52 GMT
మనమడితో కాస్తంత టైం గడపాలని అనుకున్నారో ఏమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి దేవాన్ష్ ను రప్పించారు. ఆదివారం మొదలు అవకాశం ఉన్న అన్నీ సందర్భాల్లో తన వెంట మనమడ్ని ఉంచుకునేలా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బోటు షికారు చేశారు. దేవాన్ష్ పుణ్యమా అని ప్రపంచానికి అమరావతి అందాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రజలకు అర్థమైందని చెప్పాలి.

మనమడితో సరదాగా గడపటానికి.. మనమడి మనసు దోచుకోవాలని చంద్రబాబు అనుకోని ఉండొచ్చు. అందుకే.. పిల్లలకు ఎంతో ఇష్టంగా ఫీలయ్యే బోటింగ్ కార్యక్రమాన్ని పెట్టి ఉండొచ్చు. అయితే.. దీని వల్ల జరిగిన లాభం ఏమిటంటే.. అదిరిపోయేఅందాలు ఏపీ రాజధాని సొంతమని.. పర్యాటకానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయన్న విషయం సీఎం బోటింగ్ చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.

ఉండవల్లిలోని తన నివాసం నుంచి మనమడితో మోటార్ బోటులో బయలుదేరిన చంద్రబాబు.. అలా కృష్ణా నది మీద సరదాగా 40 నిమిషాలకు పైనే గడిపారు. ప్రకాశం బ్యారేజీ.. దుర్గాఘాట్.. పున్నమి.. భవానీ ఘాట్ ల మీదుగా ఇబ్రహీంపట్నం సమీపంలోని గుంటుపల్లి వరకూ వెళ్లి వచ్చేశారు. నిజానికి ఇబ్రహీం పట్నంలోని పవిత్ర సంగమం వరకూ వెళ్లాలని అనుకున్నారు. అయితే.. అప్పటికే చీకటి పడటంతో.. భద్రతా అధికారుల చేసిన సూచనతో అక్కడికి వెళ్లకుండా వెనక్కి వచ్చేశారు.

ఒకవేళ అక్కడికి కూడా వెళ్లి ఉంటే.. వాటికి సంబంధించిన ఫోటోలు మీడియాలో పబ్లిష్ కావటం ద్వారా ఆ  ప్రాంతానికి మరింత ఆదరణ లభించేది. ఏమైనా.. దేవాన్ష్ పుణ్యమా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన బోటు షికారు.. అమరావతి అందాలు అందరికి తెలిసేలా చేశాయనటంలో సందేహం లేదు. తన అమరావతి షికారుతో అక్కడి పర్యాటక అందాల్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన దేవాన్ష్ అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా సరిగ్గా సరిపోతారని చెప్పక తప్పదు. 


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News