ఉండవల్లి సూచనలు గాలికేనా... !!!

Update: 2018-07-21 04:33 GMT
అవిశ్వాసం... భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి పడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడిన అస్త్రం. ఇందులో విజయం కోసం అన్ని ఆయుధాలను వాడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. చివరకు తనకు బద్ధ శత్రువైన లోక్‌ సభ మాజీ సభ్యుడు - మాటల దిట్ట ఉండవల్లి అరుణ్ కుమార్‌ తో ఒంటరిగా సమావేశం కూడా అయ్యారు. ఆయన నుంచి సలహాలు - సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో ఈ ఇద్దరు నాయకులు గంటకు పైగా మాట్లాడుకుని లోక్‌ సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో కూడా నిర్ణయించారు. ఇక్కడి వరకూ అన్ని సవ్యంగా జరిగాయి. సరిగ్గా సమయం వచ్చే సరికి ఉండవల్లి ఇచ్చిన సలహాలు కాని - నిర్ణయాలు కాని - వ్యూహాలు కానీ... దేన్ని వాడుకోలేదు తెలుగుదేశం లోక్‌ సభ సభ్యులు. విభజన సక్రమంగా జరగలేదని - ఇది అపవిత్ర విభజన అని ప్రధాని నరేంద్ర మోదీ ఆనాడు సభలో అన్న మాటలను ఉండవల్లి పదేపదే గుర్తు చేశారు. వీటినే సభలో ప్రస్తావించి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఇరుకున పెట్టాలని ఉండవల్లి సూచించారు. దీనికి చంద్రబాబు నాయుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే పార్టీలో ఏఏ అంశాలు ప్రస్తావించాలని నిర్ణయించారో. దేన్ని వద్దు అనుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. లోక్‌ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి చేసిన ఒక్క సూచనను కూడా తెలుగుదేశం సభ్యులు ప్రస్తావించకపోవడంపై విమర‌్శలొస్తున్నాయి.

విభజన అంశం తెర పైకి వచ్చినప్పటి నుంచి విభజన పూర్తి అయిన తర్వాత వరకూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో విషయ సేకరణ చేశారు. దీనంతటినీ పుస్తకాలుగా ప్రచురించారు కూడా. ఆ పుస్తకాలను - విభజన అనంతరం అమలు కాని హామీలను - ఇతర అంశాలను ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. వీటిపై ప్రధాన మంత్రిపైనా - కేంద్రంపైనే యుద్ధం చేసే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అవకాశాలను తుంగలో తొక్కి తన ఎంపీలకు మరేదో సూచనలు చేశారు. ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సూచనలను తూ.చ తప్పక పాటించి ఉంటే సభ లోపల - వెలుపల కూడా మరింత సానుభూతి వచ్చేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కడపలో స్టీలు ఫ్యాక్టరీ - విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ వంటి అంశాల ప్రస్తావన అతి తక్కువగా చేసిన తెలుగుదేశం లోక్‌ సభ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలను మాత్రం పట్టించుకోలేదనే అంటున్నారు. ఈ మాత్రం దానికి ఉండవల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించడమెందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News