‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించబోతున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ నేతలు - మంత్రులు - ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. వర్మపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ - మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - ఎమ్మెల్యే అనిత - త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతోన్న వాణీ విశ్వనాథ్ లు వర్మపై కామెంట్లు చేశారు. వారందరికీ వర్మ తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చారు. అసలు వర్మ సినిమా సినిమా తీయకుండానే, దానిని చూడకుండానే వర్మపై టీడీపీ నేతలు కామెంట్లు చేయడంపై విమర్శలు వచ్చాయి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన తర్వాత అందులో ఏమైనా ఇబ్బందికర సన్నివేశాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కానీ, సినిమా మొదలుకాకముందే వర్మపై వ్యాఖ్యలు చేయడం తగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై టీడీపీ నేతలెవరూ విమర్శలు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఆ సమయంలో టీడీపీ నేతలు.... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, చంద్రబాబు ఆ సినిమాపై - వర్మపై స్పందించారు. ఎన్టీఆర్ ఎవరో - ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ సినిమాపై టీడీపీ నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు. వాస్తవ ఘటనలకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించి తీసే సినిమాలకు ప్రజాదరణ ఉండదన్నారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను చూడకుండానే అందులో అభ్యంతరకర సన్నివేశాలుంటాయని - ఎన్టీఆర్ - చంద్రబాబు ల మధ్య సన్నివేశాలను లక్ష్మీ పార్వతికి అనుకూలంగానే చూపిస్తారని టీడీపీ నేతలు భావించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుమ్మడికాయల దొంగెవరంటే - భుజాలు తడుముకున్నట్లు టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని పదేపదే చెబుతున్న టీడీపీ నేతలు ఆ వాస్తవాలను వర్మ సినిమా తీసి చూపిస్తానంటే ఎందుకు భయపడుతున్నారని అనుకుంటున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నామని గ్రహించిన చంద్రబాబు ఈ సూచన చేసి ఉంటారని భావిస్తున్నారు.