ఇందుకు కదా బాబును అందరూ తప్పు పట్టేది?

Update: 2020-04-18 04:30 GMT
ప్రపంచం మొత్తం కరోనాను ఎలా జయించాలన్న అంశం మీదనే ఫోకస్ పెడుతున్నారు. రోటీన్ కు భిన్నంగా ఎంతో అవసరమైతే తప్పించి.. విపక్షాలు సైతం మౌనంగా ఉంటున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు సాయంగా ఉండాలన్న ఆలోచనతో అనవసర వ్యాఖ్యలు చేయటం లేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయ కలిగే అవకాశం ఉన్నా నోరు విప్పటం లేదు. అందరు నడిచే బాటలో నడవటం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదు.
గడిచిన కొద్దికాలంగా మౌనంగా ఉంటున్నఆయనకు.. ఏపీలోని జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా చర్యలు అస్సలు నచ్చటం లేదు.  ఏదోలా తన ఉనికిని చాటాలన్న ఆత్రుత ఆయన తీరులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. విడి రోజుల్లో రోజుకు రెండు.. మూడుసార్లు తగ్గకుండా ప్రెస్ మీట్లు పెట్టే చంద్రబాబు.. కరోనా పుణ్యమా అని హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

లాక్ డౌన్ ముందు హైదరాబాద్ కు వచ్చినఆయన.. అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఎవరు వచ్చినా పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు పంపుతామన్న సీఎం జగన్ మాటతో వెనక్కి తగ్గారు చంద్రబాబు. దీంతో ఏపీకి వెళ్లకుండా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యవహారం ఒక కొలిక్కి రావటం అంత తేలికైన విషయం కాదని గుర్తించారు. నెలలకు నెలలు పట్టే వీలుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. గడిచిన రెండు.. మూడు రోజులుగా ఏదో ఒక అంశాన్ని ఎత్తి చూపిస్తూ మీడియాలో తన ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు బాబు.

తాజాగా బహిరంగ లేఖతో తన రాజకీయాన్ని షురూ చేశారు. పేదలు.. రైతులు కరోనాతో కుదేలయ్యారని.. ఇలాంటి పరిస్థితుల్లో వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరాళాల పేరుతో వేధిస్తున్నట్లుగా ఆరోపించారు. కరోనా సహాయక చర్యల్లోనూ రాజకీయం చేస్తున్నట్లుగా మండిపడ్డారు. రాష్ట్రంలో తొలగించిన పాతిక లక్షల రేషన్ కార్డుదారులకు సాయం చేయకపోవటం దారుణంగా అభివర్ణించారు. టెస్టులు పెంచకుండానే కేసులు పెరిగినట్లు చూపిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఒక రోజు నెగిటివ్ చెప్పిన కేసు.. తర్వాతి రోజుకు పాజిటివ్ కు మారిపోతుందన్నారు.

హెల్త్ బులిటెన్లు.. ఆరోగ్య శాఖ కార్యదర్శి.. డ్యాష్ బోర్డులో అందుతున్న సమాచారంలో నిజం ఎంతన్నది అర్థం కావటం లేదన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి.. ఆశా వర్కర్లకు వెంటనే జీతాలు చెల్లించాలన్న ఆయన.. కరోనా వేళలోనూ ప్రత్యర్థులపై కేసులు పెట్టే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గట్లేదని విమర్శలు గుప్పించారు బాబు. కరోనా వేళ.. మరే రాష్ట్రంలో లేని రీతిలో ఈ తరహాలో రాజకీయాలు మాట్లాడటం టీడీపీ అధినేతకు మాత్రమే సాధ్యమనిపించక మానదు. ఇందుకేనేమో.. పలువురు బాబు పాలిటిక్స్ ను తరచూ తప్పు పడుతుంటారు.
Tags:    

Similar News