చంద్రబాబు మరో చాణక్యం!

Update: 2015-07-11 11:27 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన చాణక్యం ప్రదర్శించారు. రెండు రాస్ట్రాల సమస్యలపై చర్చించుకుందామని ఎన్నిసార్లు పిలిచినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రావడం లేదు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గవర్నర్‌ నరసింహన్‌ కూడా వినిపించుకోవడం లేదు. నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్లు ఇరువురూ వ్యవహరిస్తున్నారు. దాంతో రెండు రాష్ట్రాల సమస్యలూ కొండలా పేరుకుపోతున్నాయి. ఏపీకి నష్టం జరుగుతోంది.

జపాన్‌ నుంచి ఢిల్లీలో ఆగిన చంద్రబాబు నాయుడు అక్కడ హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. రాష్ట్ర సమస్యలను, ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహార శైలిని మరోసారి వివరించారు. వారు సమస్యలను పరిష్కరించడం లేదని, కనక ఇక వాటిని పరిష్కరించే బాధ్యత మీదేనంటూ పునర్విభజన చట్టాన్ని గుర్తు చేశారు. జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఇందుకు సమావేశం పెడితే విభజన చట్టం ప్రస్తావనకు వస్తుంది. రాజ్‌నాథ్‌ సమక్షంలో సమావేశం జరుగుతుంది కనక చట్టానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా. అదే జరిగితే సెక్షన్‌ 8కి ఒప్పుకోవాలి. షెడ్యూలు పదితోపాటు మిగిలిన సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన విభజించాలి. అప్పుడు తెలంగాణ నాయకులు ఇప్పటి వరకూ చెబుతున్న, చేస్తున్న పనులేవీ ఇకముందు సాగవని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని హోం శాఖ మరీ ముఖ్యంగా రాజ్‌నాథ్‌ కోర్టుకు నెట్టడం ద్వారా చాణక్యం ప్రదర్శించారని అంటున్నారు.
Tags:    

Similar News