నొప్పించ‌కుండా ఒప్పించ‌లేవా చంద్ర‌బాబు?

Update: 2017-11-08 17:30 GMT
నోరున్న ప్ర‌తి ఒక్క‌డూ నొప్పించే స‌త్తా ఉన్నోడే. నొప్పించ‌టం ఎంత ఈజీనో.. ఒప్పించ‌టం అంత క‌ష్టం. ఆ విష‌యాన్ని అర్థం చేసుకున్నోడి మాట తీరు చాలా వేరుగా ఉంటుంది. కోట్లాది మందిని ప్ర‌భావితం చేసే రాజ‌కీయ అధినేత‌లు త‌మ రాజ‌కీయంలో భాగంగా చాలా మాట‌లు మాట్లాడుతుంటారు. కానీ.. వారిలో చాలామంది త‌మ‌ను రాజ‌కీయంగా విబేధించే వారిని ఒప్పించే విష‌యంలో ఫెయిల్ అవుతుంటారు.

కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు మాత్రం అందుకు భిన్నం. నొప్పించ‌టం ఎంత బాగా తెలుసో.. ఒప్పించ‌టం కూడా అంతేబాగా తెలుసు. విప‌క్షాల బాధ్య‌త‌లు.. వారి విధుల‌.. వారు ఎలా న‌డుచుకోవాలి?  లాంటి చాలా అంశాల మీద నాన్ స్టాప్ గా మాట్లాడే ఆయ‌న‌.. వారు నోరెత్త‌కుండా తాను కోరిన దానికి ఓకే అనేలా చేయ‌గ‌లిగే స‌త్తా కేసీఆర్ సొంతం.

త‌న‌కు ఇష్టం లేన‌ప్పుడు విప‌క్ష నేత‌ల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం స‌సేమిరా అనే కేసీఆర్‌.. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చేయించుకునేందుకు ఎంత‌కైనా త‌గ్గుతారు. తానుపెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌తిప‌క్షాల్ని.. ప్లీజ్ అని కూడా అనగ‌లిగిన స‌మ‌ర్థ‌త ఆయ‌న సొంతం. అదెలా ఉంటుంద‌న్న‌ది మంగ‌ళ‌వారం నాటి స‌భ‌ను చూసిన‌ప్పుడు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. స‌భ‌లో బీజేపీ నేత‌లు చేస్తున్న ఆందోళ‌న‌ను స‌ర్ది చెప్ప‌ట‌మే కాదు.. విప‌క్షాలు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని.. స‌భ స‌జావుగా జ‌ర‌గ‌టానికి ఆయ‌న మాట్లాడిన మాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

అధికార ద‌ర్పంతో కాకుండా.. అణుకువ‌తో విప‌క్షాల నోట మాట రాకుండా చేసిన కేసీఆర్ వైఖ‌రి.. ఆయ‌న్ను వ్య‌తిరేకించే వారిని కూడా మెచ్చుకునేలా చేసింది.

క‌ట్ చేస్తే.. నిన్న‌టికి నిన్న త‌న పార్టీ నేత‌ల‌తో మాట్లాడే సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. మాట‌ల‌తో నొప్పించే విష‌యంలో ముందుండే బాబు.. ఒప్పించే విష‌యంలో ఎందుకు వెనుక‌బ‌డి ఉన్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. పాద‌యాత్ర‌తో పాటు.. ప్ర‌భుత్వ విధానాల తీరును త‌ప్పు ప‌ట్టిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  త‌మ పార్టీ నేత‌లు ఎవ‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కామ‌ని తేల్చేశారు.

ఇలాంట‌ప్పుడు పెద్ద‌మ‌నిషిగా ఏం చేయాలి?  విప‌క్షాల‌కు ఉన్న అభ్యంత‌రాల‌ను తాము ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్ప‌ట‌మేకాదు.. అవ‌స‌ర‌మైతే విపక్షాల ద‌గ్గ‌ర‌కు అధికార‌ప‌క్షం త‌ర‌ఫున ఒక బృందాన్ని పంప‌టం.. మాట్లాడుకోవ‌టం లాంటివి చేయాలి. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కామ‌ని తేల్చి చెప్పిన‌ప్పుడు.. వారిని ఒప్పించేలా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. అప్ప‌టికి స్పందించ‌కుంటే త‌ప్పు విప‌క్షానిది అవుతుంది.

అలాంటిదేమీ లేకుండా ప్ర‌తిప‌క్షాలు రాక‌పోతే అసెంబ్లీ ఆగిపోవాలా? స‌మావేశాలు జ‌ర‌గ‌వా? అంటూ ప్ర‌శ్న‌లు వేయ‌టం స‌ముచితంగా అనిపించుకోదు. క‌త్తితో కోసిన‌ట్లు మాట్లాడే కేసీఆర్‌.. కొన్ని సంద‌ర్భాల్లో త‌గ్గి మాట్లాడుతుంటారు. విప‌క్షాల్ని అనున‌యిస్తూ.. వారిని త‌న దారికి తెచ్చుకోవ‌టంలో విజ‌య‌వంతం అవుతున్నారు. కానీ.. ఇలాంటివేమీ బాబులో క‌నిపించ‌ని ప‌రిస్థితి. విప‌క్షాల్ని నొప్పించే క‌న్నా.. ఒప్పించే ప‌నిలో ఉంటే.. విప‌క్షం కాకున్నా ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని అయినా దోచుకునే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News