బాబును వెంటాడే 'చింత' మనేని

Update: 2018-11-18 01:30 GMT
చింతమనేని ప్రభాకర్....తెలుగుదేశం శాసనసభ్యుడు. పశ్చిమ గోదావరికి చెందని ఈ నాయకుడు గడచిన నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని నిద్రపోన్నివ్వని నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడి కంట్లో నిరంతరం ఇసుక పోస్తూ చింతమనేని చింతలు తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాసన సభ్యుడిగా చింతమనేని ప్రవర్తనా తీరు పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతోంది. ఇంతకు ముందు ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకుని చింతమనేని పార్టీకి తలవంపులు తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణ అంశంలో అధికార ప్రతిపక్ష నాయకులందరూ చింతమనేనిని దోషిగానే పేర్కుంటున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయితే చింతమనేనిపై దారణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసారు. చింతమనేని అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసీచూడనట్లు వ్యవహరించడం కూడా వివాదం అయింది. ఇదంతా గతం. తన ఇసుక అక్రమాలకు కొన్నాళ్లు ఫుల్‌ స్టాప్ పెట్టిన చింతమనేని తాజాగా మళ్లీ పాత రూపాన్ని ప్రదర్శించారు.

ఇసుక రవాణ అంశంలో రెండు రోజుల క్రితం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఒకరు చింతమనేనిని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని ఆ మాజీ ప్రజాప్రతినిధిపై చేయి చేసుకున్నారు. దీనితో ఆ ప్రజాప్రతినిధి చింతమనేనిపై కేసు నమోదు చేసారు. అధికార పార్టీ శాసనసభ్యుడు కావడంతో పోలీసులు ఈ కేసుపై చర్య తీసుకోలేదు. అయితే 24 గంటలు గడవక ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ సర్పంచ్‌ పై చింతమనేని మళ్లీ చేయి చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంఘటన సంచలనం రేపింది. చింతమనేని చేతిలో గాయపడిన తెలుగుదేశం మాజీ సర్పంచ్ కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయన గ్రామానికి చెందిన వారు చింతమనేనిని అడ్డుకున్నారు. అప్పటికప్పుడు ఆయన క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయట పడ్డారు. తమ శాసనసభ్యుడు చేస్తున్న అక్రుత్యాలపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం "మీరు ఆగ్రహం తగ్గించుకోండి. వచ్చే ఎన్నికల వరకూ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దు" అంటు సుతిమెత్తగా మందలించారని సమాచారం. రాజు తమ వాడైతే సామంతులు ఏచేయడానికైన వెనకాడరనడానికి చింతమనేని అక్రత్యాలే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News