అర‌చేతిలో అమ‌రావ‌తి చూపిస్తున్న బాబు!

Update: 2017-06-28 11:01 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిప‌థంలో దూసుకుపోతోంది. ప్ర‌పంచ‌మంతా అమ‌రావ‌తివైపు చూస్తోంది. అంతర్జాతీయ స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తి రూపొందింది. నిలువెత్తు ఆకాశహార్మ్యాలు - ఐకాన్‌ బ్రిడ్జిలు - ప్ర‌ప‌చంలోనే మేటి సౌకర్యాల్ని అమ‌రావ‌తిలో క‌నిపిస్తాయి. ఏమిటి? మాకు అటువంటివేమీ క‌నిపించ‌డం లేదంటారా? అక్క‌డే లాజిక్ ఉందండి బాబు. చంద్ర‌బాబు కళ్ళతో చూస్తేనే మీకు వాటి ద‌ర్శ‌న భాగ్యం క‌లుగుతుంది మ‌రీ!

2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో వైకుంఠం చూపించారు. సినీ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ను త‌ల‌ద‌న్నే రీతిలో గ్రాఫిక్స్ తో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ డిజైన్ ను ప్ర‌జ‌ల‌కు చూపించారు. బాబుతోనే అభివృద్ధి అని టీడీపీ నేతలు ఊరూవాడా నినదించారు. పత్రికలు - న్యూస్‌ ఛానళ్ళలో ప్రకటనలతో ఊదరగొట్టేశారు. సోషల్‌ మీడియాలో ఈ గ్రాఫిక్స్ పై బీభ‌త్స‌మైన‌ రచ్చ జ‌రిగింది.

ఈ మూడేళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్... న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ గా అభివృద్ధి చెంద‌లేద‌ని మీరు పొర‌పాటున కూడా అనుకోకూడ‌దు. అపుడు మీరు అభివృద్ధి నిరోధ‌కులు - ప్ర‌భుత్వ‌ వ్యతిరేకులు అయిపోతారు. మ‌రో రెండేళ్ల‌పాటు  చంద్రబాబు గ్రాఫిక్స్ రాజ‌ధానిని ఊహించుకోవడం త‌ప్ప చేయ‌గ‌లిగిందేం లేదు.  

పుష్కరాలు పూర్తయి ఏడాది కావ‌స్తున్నా విజయవాడలోని దుర్గగుడి సమీపంలోని ఫ్లై ఓవర్ పూర్తి కాలేదు. కానీ, మీరు చంద్రబాబు కళ్ళకు మాత్ర‌మే క‌నిపించే అత్యద్భుతమైన బ్రిడ్జి మీదకు వెళితే మాత్రం మీ ఖ‌ర్మ‌కు మీరే బాధ్యులు సుమా! ఒక బ్రిడ్జి నిర్మాణానికే ఇంత సమయం పడితే, అంత‌ర్జాతీయ రాజ‌ధానికి ఇంకెంత స‌మ‌యం ప‌డుతుందో అంచ‌నా వేయ‌వ‌చ్చు.
 
అమరావతిలోని పరిపాలనా కేంద్రంలో అసెంబ్లీ - సెక్రటేరియట్ ల‌ను తక్కువ కాలంలో నిర్మించడం గొప్ప విషయమే. కానీ, అదే రాజధాని కాదుగా? ఈ తాత్కాలిక పరిపాలనా కేంద్రాన్ని 2019 ఎన్నికల్లోనూ పబ్లిసిటీకి వాడుకుంటే అంత‌క‌న్నా హాస్యాస్పదం వేరేదీ ఉండ‌దు.

2018 నాటికి తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.  కానీ, ఇంకా డిజైన్లనే ఖరారు చేయలేదు. గ్రాఫిక్స్ అమ‌రావ‌తిని చూపించి ఎక్కువ రోజులు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌లేరు క‌దా! ఈ గ్రాఫిక్స్‌ నాటకాలు మ‌రిన్నాళ్లు సాగ‌వు. ప్ర‌జ‌ల‌కు వాస్తవాలేంటో అర్థమవుతున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ నేతల కళ్ళకు అలుముకున్న గ్రాఫిక్స్‌ పొరలు తొలగిపోతాయ్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News