బాబు హామీతో వనజాక్షి ఇష్యూ క్లోజ్‌..?

Update: 2015-07-11 09:27 GMT
ఎమ్మెల్యే చేసే అక్రమాలకు అడ్డు చెప్పారన్న ఆక్కసుతో ఒక మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన ఘటన ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షించే ఇలాంటి అంశాలపై వెనువెంటనే స్పందించాల్సి ఉన్నప్పటికీ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన జరిగే సమయానికి విదేశాల్లో ఉండటం.. ఆయనకు అందాల్సిన ఫీడ్‌బ్యాక్‌లో కాస్తంత తేడాలు ఉండటంతో ఆయన వెనువెంటనే స్పందించలేని పరిస్థితి.

విదేశీ పర్యటన నుంచి శుక్రవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వనజాక్షి ఇష్యూపై దృష్టి సారించారు. తన పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓవర్‌ యాక్షన్‌ను గుర్తించిన బాబు.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. బాధితురాలితో స్వయంగా మాట్లాడి.. ఆమెను ఊరడించే ప్రయత్నం చేసి.. విపక్షాల విమర్శల హోరును తగ్గించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో తన ఎమ్మెల్యే చేసిన తప్పుడు పనిని బహిరంగంగా ఖండించని బాబు.. రెవెన్యూ సంఘాల వద్ద మాత్రం జరిగిన ఘటన దురదృష్టకరమైనదిగా వ్యాఖ్యానించినట్లు  సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇక.. వనజాక్షిపై జరిగిన దాడిపై చేపట్టిన నిరసనను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన తాజా హామీతో విరమించినట్లు చెబుతున్నారు. దాడికి సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేస్తామని.. న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి బాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో తాము చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై దాడి జరిగిన ఘటనపై ఐఏఎస్‌ అధికారితో విచారణ చేయాలని ఆమె డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే కూడా.. ఏపీ ఉద్యోగ సంఘాల నేత.. అరడుగుల బుల్లెట్‌గా పేరొందిన అశోక్‌బాబు బద్నాం అయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా అధికారిపై అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా దాడి చేస్తే ఉద్యోగుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చి భారీ ఆందోళనలు చేయాల్సి ఉన్నప్పటికీ.. అలాంటిదేమీ చేయకుండా మిన్నకుండిపోయారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శిస్తున్నారు.

అధికారపార్టీకి వత్తాసు పలికేలా అశోక్‌బాబు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై అశోక్‌బాబు వాదన మరోలా ఉంది. ఇష్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లటంతో పాటు.. ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన వెంటనే ఆయన్ను కలిసి.. అప్పటికి న్యాయం జరగకపోతే ఆందోళన చేయాలని భావించామని.. కానీ.. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయని వాపోతున్నారు. తాజాగా విచారణ కమిటీ వేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీతో ఈ ఇష్యూ తాత్కలికంగా సద్దుమణికినట్లేనని చెబుతున్నారు.

Tags:    

Similar News