ఏపీ సర్కారులో టెంపుల్ రన్

Update: 2016-07-05 06:56 GMT
ఏపీ ప్రభుత్వంలో ఉన్న తెదేపా-భాజపా మధ్య కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విజయవాడలో 45 దేవాలయాల కూల్చివేత వ్యవహారం రెండు పక్షాల మధ్య దూరం మరింతగా పెంచింది. కూల్చివేతలపై సంఘ్ రంగంలోకి దిగడం - వందల సంఖ్యలో స్వాములు రోడ్డుమీద కొచ్చి ధర్నా చేయడంతో రాగల ప్రమాదాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు - ఒకడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. స్వాములతో భేటీ అయి - ఇకపై కూల్చివేతలుండవని - కూల్చిన వాటిని మళ్లీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో విజయవాడ ఎంపి కేశినేని నాని - ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల అత్యుత్సాహం బాబును చిక్కుల్లో నెడుతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.. గుళ్ల కూల్చివేత వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి నాయకత్వం.. మాజీ మంత్రి కన్నా - ఎమ్మెల్సీ సోము వీర్రాజు - ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ప్రతినిధి బృందాన్ని ఆలయ సందర్శనకు పంపిన సందర్భంలో వారిపై బుద్దా వ్యవహారశైలి టిడిపి అధిష్టానానికి ఇబ్బంది కలిగించింది.

శివస్వామితోపాటు - బిజెపి ఎంపి గోకరాజు గంగరాజుపై కేశినేని నాని చేసిన విమర్శలు మీడియాలో ప్రముఖంగా రావడం బాబుకు మరింత సమస్యగా మారింది. గుజరాత్‌ లో కూల్చిన దేవాలయాల గురించి నాని ప్రశ్నించడం, వీహెచ్‌ పిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గోకరాజుపై వ్యాఖ్యలు చేయటం బాబును కలవరపరిచాయి. దానికి ప్రతిగా బిజెపి నేతలు చేసిన విమర్శలు - స్వాముల హెచ్చరికలతో పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన బాబు.. యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు దిగారు. మంత్రి పుల్లారావు - దేవినేని - కామినేని - మాణిక్యాలరావుతో ఒక కమిటీని వేశారు. స్వాములు ధర్నాకు దిగితే వ్యవహారం ఢిల్లీ వరకూ వెళుతుందని గ్రహించిన బాబు - అప్పటికప్పుడు కమిటీ వేసి, వారిని ఆలయ సందర్శనకు పంపించారు. ఎంపి నాని మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. మంత్రి మాణిక్యాలరావు కూడా ముందుగా రావటానికి ఇష్టపడలేదు. ఆ సందర్భంలో మంత్రి మాణిక్యాలరావును తమతో రావాలని మంత్రి పుల్లారావు ఫోన్‌ లో కోరారు. తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నందున, తాను వచ్చి ఏం చేయాలని, తాను రానని ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. అయితే కామినేనిని తీసుకువెళతామని పుల్లారావు చెప్పడంతో మీ ఇష్టమని మాణిక్యాలరావు ఫోన్ పెట్టేసినట్లు సమాచారం. మళ్లీ కామినేని ఫోన్ చేసి బుజ్జగించిన తర్వాతనే, మాణిక్యాలరావు సందర్శనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇదంతా జరిగాక మంత్రులు స్వాములతో మాట్లాడి నచ్చచెప్పడంతో వారు కూడా శాంతించి ధర్నా విరమించుకుందామనే భావించారు. కానీ, ఆ తర్వాత నాని - బుద్దాలు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన స్వాములు.. ఎట్టి పరిస్థితిలోనూ ధర్నా చేయాల్సిందేనని పట్టుబట్టారు. పరిస్థితి చల్లబడుతున్న సమయంలో, వారిద్దరు చేసిన వ్యాఖ్యలతో వివాదం మళ్లీ మొదటికొచ్చి - సమస్య జటిలమయింది. గుళ్లను మళ్లీ నిర్మిస్తామని బాబు చెప్పారని మంత్రి కామినేని సభలో చెప్పినప్పటికీ, నాని క్షమాపణ చెప్పాలని స్వాములు డిమాండ్ చేయడం బట్టి, వారికి ఎంపిపై ఎంత ఆగ్రహం ఉందో స్పష్టమవుతోంది.

శివస్వామి - గంగరాజు తదితరులను బాబు వద్దకు తీసుకువెళ్లిన మంత్రి కామినేని నేరుగా ధర్నా వేదికపై వచ్చి, బాబును పొగుడుతూ చేసిన ప్రసంగం బిజెపి కార్యకర్తలు - భక్తులకు రుచించకపోగా, ఇది అభినందన సభ కాదని తిరగబడే వరకూ వెళ్లింది. దాంతో విధిలేక మంత్రి కామినేని వేదిక దిగి వెళ్లిపోవలసి వచ్చింది. మంత్రి వైఖరిని బిజెపి కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. అదే సమయంలో ధర్నాకు ముందు ఆవేశంగా మాట్లాడిన బిజెపి ఎంపి గంగరాజు కూడా ఆ తరువాత మెతక వైఖరి ప్రదర్శించడాన్ని బిజెపి కార్యకర్తలు తప్పుపడుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల నేతల మధ్య కోపతాపాలు - మొహమాటాలు రెండూ ఉన్నా ఈ వ్యవహారం మాత్రం విభేదాలను మరింత పెంచిందనే చెప్పాలి.
Tags:    

Similar News