గొప్పలు సరే.. అప్పుల లెక్కా చెప్పు బాబు

Update: 2016-09-28 22:30 GMT
అధికారపక్షానికి - ప్రతిపక్షానికి మధ్య తేడా ఏంటన్న ప్రశ్న వేసుకుంటే.. ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి. విషయాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇబ్బందేమిటంటే.. తమ కోణంలో మాత్రమే చూసి చెప్పే అధినేతలు.. అసలు వాస్తవాన్ని చెప్పేందుకు మాత్రం ఇష్టపడరు. ఇక.. పగలు రాత్రీ తేడా లేకుండా కష్టపడుతున్నానని అనుక్షణం ఫీలయ్యే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యవ్వారం చూస్తే.. ఆయన మాటలు కోటలు దాటుతుంటాయి. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఎంత ఎటకారంగా చెప్పుకుంటారో ఆన్ లైన్లో ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు.

గొప్పలు చెప్పుకోవటంలో బాబుకు మాత్రమే సాధ్యమవుతుంది. బాబు బ్యాడ్ లక్ ఏమిటంటే.. బాబు ఎంత మొనగాడన్న విషయాన్ని పార్టీ నేతలు అందరికి అర్థమయ్యేలా చెప్పలేరు. దీంతో.. ఆ బాధ్యతను తానే తీసుకొని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి తానెంత గొప్పవాడినన్న విషయాన్ని అదే పనిగా చెప్పుకోవటం ఎంత పెద్ద శిక్ష? కానీ.. ఆ పని నిత్యం చేస్తుంటారు చంద్రబాబు. నిజానికి ఆయన విధేయులు.. ఆయన అనుచరవర్గం కానీ ఎఫెక్టివ్ గా ఉండి ఉంటే.. తాను చేసిన గొప్పల గురించి వారే గొప్పగా చెప్పుకునే వారు.

గొప్పల సంగతిని పక్కన పెడితే.. ఏపీ రాష్ట్ర అప్పుల మాట గురించి విన్నంతనే షాక్ తగిలే పరిస్థితి. రాష్ట్రం ప్ర‌గ‌తిప‌థంలో దూసుకెళుతుందని.. మరికొన్నేళ్లలో దేశంలోనే అత్యంత ధనిక‌ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్న బాబు మాటల్లో నిజాన్ని కాస్త పక్కన పెడితే.. ఏపీ చేసిన అప్పులకు వడ్డీ కట్టటానికే ప్రస్తుతం చేస్తున్న కొత్త అప్పుల లెక్క గురించి చంద్రబాబు చెబితే బాగుంటుంది.

తరచూ ఏదో ఒక రివ్యూ చేసే చంద్రబాబు.. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన ఆయన.. పోలవరం గురించి గొప్పలు చెప్పేసుకున్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టును ఎవరూ కట్టలేదని.. ప్రతి వారం పోలవరం పనుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 2018లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.  భవిష్యత్తులో కరవు అనే మాట రాష్ట్రంలో వినిపించదని చెప్పిన చంద్రబాబు.. గోదావరి.. కృష్ణా.. పెన్నా నదులను అనుసంధానం చేసే ప్రయత్నం తాను చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇలాంటి మాటలన్నీ బాగానే ఉన్నా.. రోజురోజుకి కునారిల్లుతున్న ఆర్థిక పరిస్థితి గురించి కూడా చంద్రబాబు నోరు విప్పితే బాగుంటుంది. కానీ.. అవేమీ చెప్పకుండా తమ ప్రభుత్వ పరపతిని పెంచే అంశాల్నే ప్రస్తావించటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 12 శాతం వృద్ధిని సాధించామని.. ఇది జాతీయ వృద్ధి రేటుకంటే ఎక్కువన్న మాటను చెప్పుకొచ్చారు. సాంకేతికతను వినియోగిస్తూ ముందుకెళుతున్నామంటూ బాబు చెప్పిన మాటలు విన్నప్పుడు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బ తిన్న గుంటూరు జిల్లా రైతుల ముఖాలు అప్రయత్నంగా గుర్తుకు రావటం ఖాయం. అత్యున్నత సాంకేతికత రాష్ట్రానికి అందుబాటులో ఉన్నప్పుడు.. రైతుల‌ నష్టాన్ని కనిష్ఠస్థాయిలో ఎందుకు కట్టడి చేయలేకపోయారన్నది కోటి రూపాయల ప్రశ్న.
Tags:    

Similar News