ప్ర‌జ‌ల‌పై బాబు మార్కు మాట ఇదే!

Update: 2018-02-24 05:32 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎప్పుడేం మాట్లాడ‌తారో ఇప్పుడు అస్సలు అర్థం కావ‌ట్లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఓటు వైసీపీకేన‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు.. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేన‌న్న కోణంలో త‌న‌దైన శైలి వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఈ క్ర‌మంలో అప్ప‌టికే మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీతో పాటుగా కొత్త‌గా జ‌న‌సేన పార్టీ పేరిట రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాన‌ని ప్ర‌క‌టించిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ పొత్తు పెట్టుకున్నారు. పోలింగ్‌ కు రోజుల స‌మ‌య‌ముంద‌న‌గా ప‌వ‌న్‌ ను రంగంలోకి దించేసిన చంద్ర‌బాబు.. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సుడిగాలి ప‌ర్యట‌న చేయించారు. అంతేనా... రైతుల‌కు రుణ‌మాఫీ - డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ - నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి అంటూ బాగానే ప్ర‌చారం  చేసుకున్నారు. అప్ప‌టిదాకా నిదానంగా సాగిన ప్ర‌చారాన్ని చంద్రబాబు ఉన్న‌ట్టుండి ఓ రేంజీలో పెంచేశారు. వెర‌సి త‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌త్రికలు - టీవీ ఛానెళ్ల‌లో భారీ ఎత్తున ప్ర‌చారం చేయించారు. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చేశారు. మొత్తంగా ప్ర‌జ‌ల క‌ళ్లెదుట రంగుల ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించారు. వెర‌సి ఎలాగోలా అర‌కొర మెజారిటీతోనే అధిక సీట్లు గెలిచేసిన చంద్ర‌బాబు ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల హామీలు మ‌రిచిపోవ‌డం చంద్రబాబుకు కొత్తేమీ కాదు క‌దా.

అదే కోవ‌లో హామీల‌ను ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... రైతుల‌కు రుణ‌మాఫీని మాత్రం కాస్తంత క‌దిలించారు. నాలుగు విడ‌తల‌గా రుణ మాఫీని విడుద‌ల చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కారు... తొలి విడ‌త నిధుల‌ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగానూ భారీగా ప్ర‌చారం చేసుకున్నారు. ఇక డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సంబంధించిన రుణ మాఫీని మ‌రిచిన బాబు స‌ర్కారును జ‌నం బ‌హిరంగంగానే నిల‌దీశార‌ని చెప్పాలి. చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేశ్ మంత్రి అయ్యాక‌... జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా... ఆయ‌న‌ను మ‌హిళ‌లు రోడ్డుపైనే నిల‌దీశారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ ఆగ్ర‌హావేశానికి గురైన విష‌య‌మూ మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. మొత్తంగా ప్ర‌జ‌లు అడ‌గ‌కున్నా... ఇబ్బ‌డిముబ్బ‌డిగా హామీలిచ్చేసిన చంద్రబాబు.. వాటి అమ‌లులో మాత్రం పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో నిన్న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు నోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వినిపించాయి. ప్ర‌జ‌లు బానిస‌లుగా మారిపోయార‌ని - ప్ర‌భుత్వం ఇచ్చే రాయితీల‌కు బానిస‌లుగా మారార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇన్ పుట్ స‌బ్సీడీ - క్రాప్ స‌బ్సీడీల‌కు అల‌వాటు ప‌డిపోయిన ప్ర‌జ‌లు బానిస‌లుగానే మారిపోయార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మాట విన్నంత‌నే స‌ద‌రు కార్యక్ర‌మానికి హాజ‌రైన వారంతా షాక్ తిన్నారట‌.

అయినా ప్ర‌జ‌లు స‌డ్సీడీల‌ను ఇవ్వ‌మ‌ని చంద్ర‌బాబును నేరుగా అడిగారా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌స్తావ‌న‌కు రాక మాన‌దు. ఇన్ పుట్ సబ్సీడీ అన్న‌ది రైతుల హ‌క్కు. ఎందుకంటే... పంట వేసిన స‌మ‌యంలో ఏదేనీ వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా స‌ద‌రు పంట దెబ్బ తిన‌డ‌మో. రైతుల‌ను ద‌గా చేస్తున్న బ‌హుళ‌జాతి సంస్థ‌ల దుర్మార్గం కార‌ణంగా పంట చేతికంద‌క‌పోవ‌డంతో... పెట్టిన పెట్టుబ‌డి చేతికి రావాలంటే ప్ర‌భుత్వాలు ఆదుకోవాల్సిందే. ఇందులో చంద్రబాబు అయినా - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అయినా పెద్ద‌గా చేస్తున్న‌దేమీ లేదు. ఇన్ పుట్ స‌బ్సీడీ కోసం రైతులు కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల‌కు చెల్లిస్తుండ‌గా - మ‌రికొంత మొత్తాన్ని ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. ఈ క్ర‌మంలో ఇన్ పుట్ స‌బ్సీడీ రైతుల హ‌క్కు. అయినా ఏదేనీ ప్ర‌మాదం జ‌రిగితే న‌ష్ట‌పోయిన ఆస్తి న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకునేందుకు ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నింటీకి వ‌ర్తిస్తోంది. అలాంటిది దేశానికి వెన్నెముక‌లా ఉన్న రైత‌న్న‌కు ఇన్ పుట్ స‌బ్సీడీపై హ‌క్కు లేదా? త‌ప్ప‌నిస‌రిగా ఉంద‌నే చెప్పాలి. ఇక క్రాప్ స‌బ్సీడీ ఇవ్వ‌మ‌ని ఏ రైతూ చంద్ర‌బాబును అడ‌గ‌లేద‌నే చెప్పాలి. పాద‌యాత్ర‌లు చేస్తున్న రాజ‌కీయ నేత‌ల‌ను క‌లుస్తున్న రైతులు... త‌మ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్కేలా చేయ‌డంతో పాటు విత్త‌నాలు - పురుగు మందులు అమ్మే వారి విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, త‌మ‌ను ముంచేసే కంపెనీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాత్ర‌మే కోరుతున్నారు త‌ప్పించి.. క్రాప్ సబ్సీడీ ఇవ్వ‌మ‌ని ఏ రైతూ కోరిన దాఖ‌లా లేదు.

ఈ నేప‌థ్యంలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో క్రాప్ స‌బ్సీడీని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... దానిని త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే వాడుకున్నారు త‌ప్పించి... రైతుల‌ను పెద్ద‌గా ఆదుకున్న‌దేమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వం నుంచి విడుద‌లైన స‌బ్సీడీ ద్వారా పూర్తిగా ల‌బ్ధి జ‌రిగింద‌ని చెబుతున్న రైతుల‌ను వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చ‌న్న వాద‌న లేక‌పోలేదు. అంతేకాకుండా ప్ర‌భుత్వం అమ‌లు చేసిన స‌బ్సీడీ వ‌ల్ల త‌మ‌కు ఏం ప్ర‌యోజ‌నం జ‌రిగిందో కూడా అర్థం కావ‌డం లేద‌ని మెజారిటీ రైతులే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల‌ను మొత్తంగా ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు బానిసలుగా అభివ‌ర్ణించ‌డం నిజంగానే ఆశ్చ‌ర్య‌మే. అయినా త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం క్రాప్ స‌బ్సీడీని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఆ స‌బ్సీడీల‌కు ప్ర‌జ‌లు బానిస‌ల‌య్యారంటూ వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే... ప్ర‌జ‌ల‌పై చంద్ర‌బాబుకు ఏ విధ‌మైన అభిప్రాయం ఉందో ఇట్టే అర్థం కాక‌మాన‌దు.

Tags:    

Similar News