చంద్రబాబు చిరునవ్వు వెనుక..?

Update: 2015-09-02 18:09 GMT
మిగిలిన నేతలకూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నా.. చంద్రబాబు ముఖంలో చిరునవ్వు చూసింది చాలా తక్కువసార్లు అని చెప్పకతప్పదు. ఈ కారణంతోనే.. దివంగత మహానేత వైఎస్ సైతం.. ఇదే విషయాన్ని తరచూ ప్రస్తావిస్తూ చంద్రబాబును మరింత ఇరిటేట్ చేస్తుండేవారు.

చంద్రబాబు చిరునవ్వు గురించి పదే పదే ప్రస్తావించిన తర్వాత నుంచి బాబులో మార్పు వచ్చిందని చెప్పాలి. అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఏది ఏమైనా.. మిగిలిన నేతలతో పోలిస్తే.. చంద్రబాబు ముఖంలో చిరునవ్వు కాస్త తక్కువే. అలాంటి బాబు ముఖంలో ఈ రోజు నవ్వులు విరబూశాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటే చాలు.. బీపీ విపరీతంగా పెరిగిపోవటం.. గొంతు చించుకొని అరవటం.. బాధతో. . వేదనతో వ్యాఖ్యలు చేయటం లాంటివి కనిపిస్తుంటాయి.

అలాంటిది బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసిన ప్రతిఒక్కరూ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా గమనించి ఉంటారు. బాబు.. ముఖంలో నవ్వు స్పష్టంగా కనిపించటంతో పాటు.. ఆయన పలు సందర్భాల్లో విపక్షంపై విరుచుకుపడి.. ఆ తర్వాత నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తుంది. బాబు లాంటి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించారంటే దాని వెనుక అర్థం.. పరమార్థం చాలానే ఉంటుంది.

బుధవారం నాటి సభ జరిగిన తీరు చూస్తే.. చాలా విషయంలో విపక్షాలపై అధికారపక్షం విరుచుకుపడటం.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున అందుకు బలమైన కౌంటర్ ఇచ్చే వారు లేకపోవటం ఆయన సంతోషానికి కారణంగా చెప్పాలి. పలు అంశాల విషయంలో ముఖ్యమంత్రి ధీటుగా సమాధానం చెప్పటం.. బాబుకు కౌంటర్ వేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విఫలం కావటం కూడా  బాబు చిరునవ్వుకు కారణంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News