నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 'చంద్ర‌' విహంగం?

Update: 2018-08-28 09:13 GMT
గ‌త నాలుగేళ్ల‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్తంగా విచ్చ‌ల‌విడిగా ప‌ర్య‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వీవీఐపీ హోదాలో చంద్ర‌బాబు ఆ ప‌ర్య‌ట‌న‌ల కోసం ఓ ప్ర‌త్యేక విమానాన్ని వినియోగిస్తున్నారు. అయితే, బాబుగారు విహ‌రిస్తోన్న లోహ విహంగానికి పూర్తి అనుమ‌తులు లేవ‌ని తెలుస్తోంది. ఆ మాట‌కొస్తే ఆ విమానాన్ని ఏర్పాటు చేసిన సంస్థ ....నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆ విమానం న‌డుపుతోంద‌ని కూడా పుకార్లు వ‌స్తున్నాయి. అన్ని జాగ్రత్తలు పాటించ‌కుండానే అన్ని అనుమతులు లేని ఆ విమానంలో చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్నార‌ట‌. అదీగాక గ‌త మూడేళ్లో 200 సార్లు చంద్ర‌బాబు అందులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. కానీ, 50 సార్లే ఈ విమానంలో చంద్ర‌బాబు ప్రయాణించారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్ల‌డించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

సీఎం చంద్ర‌బాబు కోసం న‌వయుగ కంపెనీ యాజమాన్యం ది ఎంబ్రార్ వీటీ సీకేపీ విమానం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు ఆయ‌న అనుచరగణం ఇందులో ప్ర‌యాణిస్తుంటారు. ఆ విమానానికి కేవలం ఇంధనం - ఎయిర్‌ పోర్ట్ పార్కింగ్ ఫీజు మాత్రమే చెల్లిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కానీ, కమర్షియల్ ఫ్లైట్ లాగా ఇది ర‌న్ అవుతోంది. అయితే, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దీనిని న‌డుపుతున్నార‌ని తెలుస్తోంది. ఆ విమానానికి నాన్ షెడ్యూల్ ఆపరేటర్ పర్మిట్ లేదు. కమర్షియల్ ఆపరేషన్స్ లైసెన్స్ లేదు. మ‌రోవైపు,  ఏడాదిగా ఆ విమానం వినియోగించడం లేదని సీఎంవో నుంచి ప్రకటన వ‌చ్చింది. ఆ ఏడాది సమయంలో విమానానికి మరమత్తులు చేసిన‌ట్లు తెలుస్తోంది.ఆ విమానం యాజమాన్యం నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 2009లో మాజీ ముఖ్యమంత్రి - దివంగ‌త నేత‌ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ క్రాష్‌ లో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ క‌ళ్లు తెర‌వ‌ని అధికారులు...భద్రతా అంశాలను పాటించకుండా ఈ త‌ర‌హా విమానాలను ఉప‌యోగించ‌డం, సీఎం కూడా ప‌ట్టిప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.
Tags:    

Similar News