ఎమ్మెల్యే రోజాపై టీడీపీ అభ్యర్థి ఎవరంటే?

Update: 2019-03-06 04:31 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంటా బయటా కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ రోజా మారారు. ఆమెను ఓడించేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. తాజాగా చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పార్టీ నేతలతో చేసిన కసరత్తు ముగిసింది. నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా స్థానంలో మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం. మంగళవారం రాత్రి 10.30 గంటల వరకూ ఉండవల్లిలోని తన నివాసంలో  చర్చించినా రోజాపై ధీటైన అభ్యర్థి చంద్రబాబుకు కనిపించకపోవడంతో ఆ స్థానంలో అభ్యర్థిని టీడీపీ వాయిదా వేసింది.

తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికను చేపడుతోంది. మంగళవారం చిత్తూరు లోక్ సభ పరిధిలోని కుప్పం - పలమనేరు - పూతలపట్టు - జీడీనెల్లూరు - చిత్తూరు - నగరి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలను పిలిచి చర్చించారు.

ఇందులో చిత్తూరు ఎంపీగా మళ్లీ శివప్రసాద్ కు ఖాయం కాగా.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు పోటీ లేదు. ఇక పలమనేరు నుంచి మంత్రి అమరనాథరెడ్డికి సీటు ఖాయమైంది. చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీచేస్తారని బాబు ఎప్పుడో నిర్ణయించారు. ఇక చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సత్యప్రభ మినహా టీడీపీకి ఆప్షన్ దొరకలేదట..

ఇక మిగిలిన నగరి - జీడీనెల్లూరు - పూతలపట్టు సెగ్మెంట్లపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేశారు. పూతలపట్టు సీటును టీడీపీ ఇన్ చార్జి లలిత కుమారితోపాటు మాజీ ఎమ్మెల్యే రవి - సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ ఆశిస్తున్నారు. అధిష్టానం మాత్రం అనుభవం - మాజీ ఎమ్మెల్యే కావడంతో లలితకుమారివైపు మొగ్గు చూపింది.

ఇక జీడీనెల్లూరు లో టీడీపీ ఇన్ చార్జి హరికృష్ణ - కొత్తగా తనూజ అనే మహిళ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. క్యాడర్ మొత్తం హరికృష్ణకు సపోర్టు చేయడం.. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ పోతుండడంతో ఆయనకే టికెట్ ఖాయమైంది.

ఇక చంద్రబాబును తీవ్రంగా ఇరుకునెపెట్టే ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి సీటుపై మాత్రం టీడీపీలో స్పష్టత రాలేదు. నగరిలో గత సారి టీడీపీ నుంచి పోటీచేసిన ముద్దుకృష్ణమ నాయుడు చనిపోవడంతో ఇప్పుడు నాయకుడు లేకుండా పోయారు. ఆయన కుమారుడు భానుప్రకాష్ - సతీమణీ  సరస్వతమ్మ బరిలో ఉన్నా వారి బలం అంతంత మాత్రమేనట.. ఇక సిద్ధార్థ స్కూల్స్ అదినేత కొండూరు అశోక్ రాజ్ కు ముఖ్యనేతలంతా మద్దతుగా నిలిచారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటును తేల్చే పనిలో అధిష్టానం ఉందట.. ఎవరు రోజాను ఓడించగల సమర్థులు అని బాబు ఆరాతీస్తున్నారట.. రోజాను ఖచ్చితంగా ఓడించాలని యోచిస్తున్న బాబు ఆమెపై బలమైన అభ్యర్థి కోసమే నగరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం.




Tags:    

Similar News