పరిహారం విషయంలో భలే పాయింట్ బయటకు తీసిన చంద్రబాబు

Update: 2022-07-22 03:20 GMT
ఇటీవల కురిసిన వర్షాలతో వరద పోటు బారిన పడిన కుటుంబాల్ని పరామర్శించేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పలు ప్రాంతాల్లో పర్యటించారు. పశ్చిమగోదావరితో పాటు కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సహాయక కార్యక్రమాలపైనా.. చర్యలపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇద్దరు బాధితుల ఇళ్లకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కీలకమైన పాయింట్ ను ప్రస్తావించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టేలా.. ఆయనకు చిరాకు పుట్టే మాటల్ని మాట్లాడిన చంద్రబాబు పుణ్యమా అని జగన్ సర్కారుకు ఇబ్బందులుతప్పవని చెప్పాలి. భారీ వర్షాలు.. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం గాల్లో వచ్చి పైపైన తిరిగి వెళ్లిపోతున్నారన్నారు. అలా చేస్తే ప్రజలు ఎదుర్కొనే కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు.

బాధిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తున్న విషయాన్ని తెలుసుకొని అదరాబాదరాగా ఒక్కో బాధితుడికి రూ.2వేలు చొప్పున పరిహారం ఇస్తున్నారన్నారు. ఓపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున సాయం ఇస్తున్నారన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి బాధితులకు రూ.10వేల చొప్పున ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం రూ.2వేలు ఇవ్వటం ఏమిటి?’ అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేల డబ్బులు ఇళ్లల్లో చేరిన బురదను కడుక్కోవటానికి కూడా సరిపోవన్నారు. బాధ్యత లేని ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉండలేక విలీన మండలాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారన్నారు.

బాధితులను పట్టించుకున్నది లేదని.. తాను వస్తే సమస్యలు చెప్పొద్దని వాలంటీర్ల చేత బెదిరించారన్న చంద్రబాబు.. ‘బెదిరిస్తే రెండు రోజులు భయపడతారేమో? కానీ తిరగబడితే ఏం చేస్తారు? తమలపాకు సాగుకు ఎకరాకు రూ.50వేలు.. అరటికి రూ.30 వేలు పెట్టుబడి పెడతారు. వరదలకు లంకల్లోని ఉద్యాన పంటలు పూర్తిగా మునిగిపోయాయి. నష్టపోయిన ప్రతి రైతుకు రూ.50వేలు పరిహారం ఇవ్వాలి. ఇళ్లు.. సామాన్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించి.. రూ.10వేలు సాయం కింద ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.

లంకల్లో బాధితులకు కనీసం మంచినీళ్లు తాగటానికి కూడా ఏర్పాట్లు జరగలేదన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం మంచినీళ్లు అందించకుంటే.. ఆ బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. ‘మీరు తాగుతున్న నీళ్లను జగన్ రెడ్డి తాగగలరా? రియల్ టైం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. మూడేళ్లుగా డయాఫ్రం వాల్ ఏమైందో చెప్పలేకపోతున్నారు.

ఇప్పుడు దిగువ కాఫర్ డ్యాం దెబ్బ తిందని చెబుతున్నారు.వీటన్నింటికి ప్రభుత్వ వైఫల్యాలే కారణం’ అంటూ మండిపడ్డారు. మొత్తంగా సీఎం జగన్ ను ఇరిటేట్ చేసేలా మాట్లాడిన చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయని చెబుతున్నారు. తన ప్రసంగాల్లో చంద్రబాబు లేవనెత్తిన పాయింట్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్న విషయం వైసీపీ నేతల మాటల్లో స్పష్టమవుతోందని చెబుతున్నారు.
Tags:    

Similar News