ఇకపై ఉత్త బాబు కాదు.. డాక్టర్ చంద్రబాబు

Update: 2015-12-18 05:10 GMT
ప్రముఖులకు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వటం మామూలే. కాకుంటే.. ప్రఖ్యాత వర్సిటీ ఒక తెలుగువాడిని గుర్తించి డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించటం కాస్తంత అరుదైన అంశంగా చెప్పొచ్చు. ఆ ఘనతను సాధించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షికాగో విశ్వవిద్యాలయం బాబుకు గౌరవ డాక్టరేట్ ను ఇవ్వాలని డిసైడ్ చేసింది. ధీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విదేశీ రాజకీయ నాయకులకు షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించటం ఇదే తొలిసారి. ఆ జాబితాలో చంద్రబాబు పేరుండటం కాస్తంత గొప్ప విషయమేనన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ అవార్డు ఇస్తున్నట్లుగా వర్సిటీ పేర్కొంది. షికాగో వర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ పై తమ్ముళ్లు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. గతంలో తనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చేందుకు పలు వర్సిటీలు ప్రయత్నించాయని.. కానీ తాను వాటిని తిరస్కరించినట్లు చెప్పుకున్నారు. షికాగో వర్సిటీ చరిత్రను చూసి.. తాను వారిచ్చే గౌరవ డాక్టరేట్ కు ఓకే చెప్పినట్లుగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ లో హైటెక్ సీఎంగా పేరొందిన బాబు.. విభజన తర్వాత కష్టాల సుడిగుండంలో ఉన్న ఏపీకి ముఖ్యమంత్రి కావటమే కాదు.. తన సమర్థతతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్న మాట వినిపిస్తున్న సమయంలోనే.. బాబును షికాగో వర్సిటీ గుర్తించటం బాబు ఇమేజ్ ను మరింత పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News