అమ్ర‌పాలికి సీఎస్ ఫోన్ కాల్‌? ఏం జ‌రిగింది..?

Update: 2018-01-30 03:59 GMT
ఐఏఎస్‌.. ఐపీఎస్ లు ఎలా ఉండాలి? న‌్యాయ‌మూర్తులు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఇలా చెప్పుకుంటే ఉన్న‌త స్థానాల్లో ఉండే అధికారులకు సంబంధించి అలిఖిత రూల్ బుక్ ఒక‌టి నానుడిలో ఉంది. అందులోని అంశాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన వెంట‌నే వారిపై ముద్ర‌లు వేయ‌టం అల‌వాటు.

ఒక ఐఏఎస్ అధికారిణి జీన్స్ వేసుకోవ‌టం చూశామా? ఒక కాలేజీ అమ్మాయి మాదిరి స‌ర‌దాగా.. ఫ్యాష‌న్ గా ఉండ‌టాన్ని ఊహించ‌గ‌ల‌మా? ఎట్టి ప‌రిస్థితుల్లో లేద‌నే చెబుతాం. కానీ.. ఇప్ప‌టి త‌రానికి ఉద్యోగం వేరు.. వ్య‌క్తిగ‌తం వేర‌న్న స్వ‌తంత్ర భావ‌న ఉంటుంది. అలాంటి వారిని అర్థం చేసుకునే క‌న్నా అపార్థం చేసుకోవ‌ట‌మే ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకు మీడియా సైతం మిన‌హాయింపు కాదు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి వ్య‌వ‌హార‌మే తీసుకోండి. ఆమె వ్య‌వ‌హార‌శైలి.. వ‌స్త్ర‌ధార‌ణ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆమె మాట‌ల్లో నిజాయితీ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌న‌సులో అనుకునే మాట‌ను మాట‌ల్లో చెప్పే తీరు ఉంటుంది. న‌లుగురిలో మెప్పు కోస‌మో.. అంద‌రి ముందు ఒక‌లా.. విడిగా మ‌రోలా ఉండే తీరుకు ఆమె భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

ఎంత‌లా అంటే.. క్యాంప‌స్ సెల‌క్ష‌న్ల వేళ‌.. ఉద్యోగ‌న్వేష‌ణ విష‌యంలో ఎలాంటి ఎత్తులు వేయాలో చెబుతారు. ఆమె చెప్పే వాటిల్లో కొన్ని అమోద‌యోగ్య‌మైన‌వి కాక‌పోవ‌చ్చు. కానీ.. అంద‌రూ చేసేదే. కానీ.. న‌లుగురి ముందు చెప్పుకోవ‌టానికి తెగ మొహ‌మాటానికి గురి అవుతుంటారు. కానీ.. అమ్ర‌పాలి మాత్రం అలా చేయ‌రు. తాను అనుకున్న‌ది.. ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని అస్స‌లు ఆగ‌దు.స్వేచ్ఛగా సంచ‌రించే విహంగం మాదిరి ఆమె వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అది సోకాల్డ్ రాజ‌కీయ నాయ‌కుల‌కు.. సాటి బ్యూరోకాట్ల‌కు అస్స‌లు న‌చ్చ‌దు.

మొన్న‌టికి మొన్న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హోదాలో అమ్ర‌పాలి ప్ర‌సంగ పాఠాన్ని చ‌ద‌వాల్సి వ‌చ్చింది. దాన్ని చ‌దివే విష‌యంలో.. గ‌ణాంకాల్ని కోట్ చేసే స‌మ‌యంలో త‌డ‌బాటు క‌నిపించింది. ప్ర‌భుత్వ ప‌థ‌కానికి సంబందించి గొప్ప‌లు రాసిన వేళ‌.. దాన్ని చ‌దువుతూ.. మ‌ధ్య‌లో ఆగి ఇట్స్ ఫ‌న్నీ అంటూ య‌థాలాపంగా బ‌య‌ట‌కు అనుకూడ‌ని మాట‌ను అనేశారు.

ఈ విష‌యం మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో.. అమ్ర‌పాలి ఖాతాలో మ‌రో వివాదం చేరిపోయింది. మీడియాలోనూ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రిగిన ఈ అంశంపై అధికార‌ప‌క్షానికి ఒళ్లు మండ‌టంతో సీఎస్ స్పందించ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌భుత్వాధినేత ఎలా రియాక్ట్ అయ్యార‌న్న విష‌యం బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం మాత్రం క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి మాట‌ల విష‌యంలో గుర్రుగా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగింది. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్ అమ్ర‌పాలికి ఈ రోజు (సోమ‌వారం) ఫోన్ చేశారు.

క‌లెక్ట‌ర్ హోదాలో ప్ర‌సంగిస్తూ.. అలా ఎలా మాట్లాడ‌తార‌ని అడిగిన‌ట్లుగా తెలుస్తోంది. అవ‌స‌రం లేకున్నా న‌వ్వార‌న్న ఆరోప‌ణ‌పైనా వివ‌ర‌ణ కోరిన‌ట్లుగా తెలుస్తోంది. సీరియ‌స్ కాలేదు కానీ.. ఇలాంటి వైఖ‌రి మంచిది కాద‌ని.. ఇలా చేయ‌కూడ‌ద‌ని అనున‌యంగా చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. బ‌య‌ట‌కు వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం అయితే.. సీఎస్ సీరియ‌స్ అయ్యార‌ని.. అమ్ర‌పాలి చేసిన ప‌నికి సీఎస్ వివ‌ర‌ణ కోరిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రీ వివ‌ర‌ణ అమ్ర‌పాలి స్వేచ్ఛ‌కు ఎంత‌మేర బ్రేకులు వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News