పవన్ పై తెలుగు తమ్ముడి పాజిటివ్ రియాక్షన్

Update: 2016-11-11 14:28 GMT
బహిరంగ సభ పెట్టిన తాను అనుకున్నది అనుకున్నట్లుగా సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్షం నేతలు దుమ్మెత్తి పోయటం తెలిసిందే. తిరుపతి.. కాకినాడ సభల తర్వాత ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొందరు నేతలు పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడితే.. మరికొందరు మాత్రం ఆచితూచి స్పందించటం కనిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన అనంతపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యపై ఏపీ అధికారపక్ష నేతలు పెద్దగా రియాక్ట్ కాలేదని చెప్పాలి. గతంలో మాదిరి పవన్ వ్యాఖ్యలపై తొందరపాటుగా స్పందించటం మంచిది కాదన్న భావన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుందని చెబుతున్నారు. పవన్ ను విమర్శించటం ద్వారా జనాల్లో చులకన కావటం ఖాయమన్న భావన కొందరి నేతల్లో వ్యక్తమై వెనక్కి తగ్గుతుంటే.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక మరికొందరు కామ్ గా ఉంటున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి.. హోం మంత్రి చినరాజప్ప పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని.. ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లుగా తన దృష్టికి వస్తుందని.. అందులో నిజానిజాల్ని చెక్ చేసుకోవాలని.. ఒకవేళ తనకు అందిన సమాచారం కానీ తప్పు అయితే తన దృష్టికి తేవాలన్న ఆయన.. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కారణంలో ఒరిగేది ఏమీ ఉందన్న విమర్శ చేశారు. అనంతపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చినరాజప్ప.. ‘‘ఆయన చెప్పిన అంశాల్ని సూచనగా స్వీకరిస్తాం. మంచి పాలన అందించాలన్నదే ప్రభుత్వ ఏకైక ధ్యేయం’’ అని చెప్పటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చినరాజప్ప ఇంతకు మించి ఆయన మాత్రం ఏం అనగలరు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News