అవును.. చిరు ఎక్క‌డికి పోరు.. అలా అని రారు

Update: 2017-04-08 10:47 GMT
మెగాస్టార్ చిరంజీవి వ్య‌వ‌హారం ఏపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌జారాజ్యం అధినేత‌గా ఆయ‌న్ను కానీ పార్టీలోకి తీసుకొస్తే.. క్రౌడ్ ఫుల్లింగ్‌కు ఢోకా ఉండ‌ద‌ని.. ఆయ‌న ఛ‌రిష్మాతో బండి లాగించొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. చిరు మీద ఎన్నో ఆశ‌ల‌తో ఆయ‌న్ను పార్టీలో క‌లిపేసుకొని.. ఆయ‌న కోరిన‌ట్లే ప‌ద‌వులు ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడు ఆయ‌న చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌.

పార్టీ ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు.. నేత‌ల‌తో ట‌చ్ లో ఉంటూ.. అధినాయ‌క‌త్వం ద‌గ్గ‌ర హ‌డావుడి చేసిన చిరు.. కేంద్ర‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలోనూ పార్టీ ప‌క్షాన ఉన్నారే కానీ.. త‌న‌ను న‌మ్మిన తెలుగు ప్ర‌జ‌ల ప‌క్షాన ఆయ‌న నిల‌వ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి అంత విధేయుడిగా ఉన్న ఆయ‌న‌.. పార్టీ చేతుల్లో నుంచి ప‌వ‌ర్ చేజారిన త‌ర్వాత నుంచి ఆయ‌న తీరులో చాలానే మార్పు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో పార్టీకి త‌గిలిన చావుదెబ్బ నాటి నుంచి ఆయ‌న పార్టీకి కాస్త దూరంగానే ఉన్నార‌ని చెప్పాలి. మ‌రీ.. బాగోద‌న్న‌ట్లుగా కొన్నికార్య‌క్ర‌మాల‌కు ముఖం చూపించే ఆయ‌న‌.. చాలా సంద‌ర్భాల్లో పార్టీ కార్య‌క‌ల‌పాల‌కు దూరంగానే ఉంటున్నారు. ఎందుక‌లా అన్న ప్ర‌శ్న‌కు కాంగ్రెస్ నేత‌లు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

 తాజాగా అలాంటి ప‌రిస్థితే మ‌రోసారి ఎదురైంది. ఏపీ కాంగ్రెస్ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి చిరు గైర్హాజ‌రు కావ‌టంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు మాజీ మంత్రి ప‌ళ్లంరాజు రియాక్ట్ అయ్యారు. అనివార్య కార‌ణాల‌తోనే చిరురాలేద‌ని.. ఆయ‌న వేరే ప‌నుల్లో బిజీగా ఉన్నట్లు స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వ‌దిలి ఎక్క‌డికి వెళ్ల‌ర‌ని.. ఇత‌ర పార్టీల్లో చేర‌తార‌న్న వార్త‌లు ఊహాగానాలేన‌ని.. ప‌ళ్లంరాజు చెప్పారు. ఆయ‌న మాట‌లు విన్న వారిలోకొంద‌రు మాత్రం.. అవును.. చిరంజీవి ఎక్క‌డికి వెళ్ల‌రు.. అలా అనిపార్టీలోనూ పాలు పంచుకోరు.. ఆయ‌న ఉన్నా.. లేన‌ట్లేన‌న్న గుస‌గుస‌లు వినిపించ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News