బుర్ఖా వేసుకొనివ‌చ్చి పాయింట్ బ్లాక్ లో కాల్చేశారు

Update: 2015-11-17 08:55 GMT
ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన చిత్తూరు మేయ‌ర్ క‌టారి అనురాధ దారుణ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ముగ్గురు దుండ‌గులు మేయ‌ర్ ను.. ఆమె భ‌ర్త‌ను అతి స‌మీపం నుంచి కాల్చిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప‌క్కా ప్లాన్ తో వ‌చ్చిన దుండ‌గులు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలోనే హ‌త్య చేయ‌టం గ‌మ‌నార్హం.

మేయ‌ర్ ను హ‌త్య చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్న వివ‌రాలేమంటే.. న‌లుగురు బుర్ఖా ధ‌రించిన వారు.. త‌మ స‌మ‌స్య‌ల్ని విన్న‌వించుకునేందుకు మేయ‌ర్ ఛాంబ‌ర్ కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఛాంబ‌ర్ లో 8 మంది కార్పొరేట‌ర్లు.. ఇత‌ర నాయ‌కులు చూస్తున్న స‌మ‌యంలోనే మేయ‌ర్ అనురాధ‌.. ఆమె భ‌ర్త మోహ‌న్ ల మీద క‌త్తితో దాడి చేసి.. పాయింట్‌ బ్లాక్ లో నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. మేయ‌ర్ మీద మొద‌ట కాల్పులు జ‌రిపగా.. ఆమె భ‌ర్త మోహ‌న్ మీద క‌త్తుల‌తో దాడి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. మేయ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. హ‌త్య చేసిన అనంత‌రం.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే వారు కార్పొరేష‌న్ గోడ దూకి పారిపోయారు. తిరిగి వెళ్లేట‌ప్పుడు బైకుల మీద వీరు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. హ‌త్య చేసి వెళ్లిపోయే స‌మ‌యంలో తుపాకీ జారి ప‌డింద‌ని.. ముగ్గురు బుర‌ఖాలు వ‌దిలేసి వెళ్లిపోయారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హ‌త్యకు పాల్ప‌డిన దుండ‌గుల వ‌య‌సు 20 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండొచ్చ‌ని చెబుతున్నారు. ఊహించ‌ని విధంగా దుండ‌గులు విరుచుకుప‌డ‌టంతో చుట్టూ ఉన్న వారు షాక్ కు గురై.. తేరుకునే లోపే పారిపోయిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల వాద‌న‌.  మ‌రోవైపు మేయ‌ర్‌ ను హ‌త్య చేసింది తామేనంటూ ఇద్ద‌రు నిందితులు చిత్తూరు వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయారు. ప్ర‌స్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు.

హ‌త్య‌కు పాల్ప‌డిన వారంతా క‌ర్ణాట‌క‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోలీసుల‌కు లొంగిపోయిన ఇద్ద‌రు నిందితుల‌కు సంబంధించిన వివ‌రాలు పోలీసులు వెల్ల‌డించ‌టం లేదు. మ‌రో ఇద్ద‌రు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:    

Similar News