సీఐడీ విచార‌ణ‌లో భూమ‌న ఏం చెప్పారంటే...

Update: 2016-09-06 09:40 GMT
వైకాపా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి మంగ‌ళ‌వారం సీఐడీ అధికారుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. కాపు ఆందోళ‌న సంద‌ర్భంగా తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో జ‌రిగిన ర‌త్నాచ‌ల్ రైలు విధ్వంసం స‌హా త‌ర్వాత జ‌రిగిన ద‌హ‌నాల‌కు సంబంధించి నాలుగు రోజుల కింద‌ట ఆయ‌న ప్రెస్ మీట్‌ లో ఉండ‌గానే సీఐడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో మంగ‌ళ‌వారం గుంటూరులోని సీఐడీ ఆఫీస్‌ కు వ‌చ్చిన క‌రుణాక‌ర‌రెడ్డి.. త‌న‌కు ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేద‌ని అధికారుల‌కు చెప్పిన‌ట్టు తెలిసింది. త‌న‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

చట్టంపై ఉన్న గౌర‌వంతోనే తాను సీఐడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాన‌న్న ఆయ‌న‌.. కాపుల‌కు వైకాపా మ‌ద్ద‌తు కొన‌సాగుతుంద‌న్నారు. అయితే, ఆందోళ‌న‌ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు.  కాపుల ఉద్య‌మాన్ని నీరుగార్చి.. త‌న పంతం నెగ్గించుకునేందుకే చంద్ర‌బాబు ఇలా త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని అన్నారు. తుని ఘటనకు ముందు కానీ, ఆ తర్వాత కానీ తాను కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కాలేదని చెప్పారు.విప‌క్ష నేత‌ల‌ను ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని, అందులో భాగంగానే త‌న‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింద‌ని భూమన విమ‌ర్శించారు.

 సీఐడీకి స‌హ‌క‌రించేందుకు తాను ఎప్పుడూ సిద్ధ‌మేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా కాపుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని భూమ‌న డిమాండ్ చేశారు. కాగా, తుని విధ్వంసానికి సంబంధించి సీఐడీ అధికారులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భూమ‌న‌ను విచార‌ణ నిమిత్తం గుంటూరుకు పిలిపించారు. ఇక‌, ప్ర‌భుత్వ వైఖ‌రిపై వైకాపా నేత‌లు కూడా ఫైర‌య్యారు. త‌మ‌ను కావాల‌నే చంద్ర‌బాబు టార్గెట్ చేస్తున్నార‌ని ఆరోపించారు. త‌మ‌పై ఎన్ని కేసులు పెట్టినా ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వాన్నినిల‌దీస్తూనే ఉంటామ‌న్నారు.
Tags:    

Similar News