షాకింగ్: ప్రిన్సిపాల్‌ ను కాల్చి చంపిన విద్యార్థి!

Update: 2018-01-21 05:06 GMT
మాతృదేవోభ‌వ‌....పితృదేవోభ‌వ‌....ఆచార్యదేవోభ‌వ‌.....త‌ల్లిదండ్రుల త‌ర్వాత అంత గొప్ప స్థానం మ‌న‌కు విద్యాబుద్ధులు - సుద్దులు చెప్పిన గురువుదే! ఒక విద్యార్థి జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి త‌ల్లిదండ్రుల‌తోపాటు గురువు పాత్ర కూడా ఎంతో కీలకం. విద్య‌తోపాటు విద్యార్థుల‌కు మంచి న‌డ‌వ‌డిక‌ - క్ర‌మ‌శిక్ష‌ణ అందించ‌డం గురువుల బాధ్య‌త‌. ఆ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను విద్యార్థుల‌కు అల‌వ‌రిచే క్ర‌మంలో ఒక స్థాయి వ‌ర‌కు మంద‌లించడం దండించ‌డం గురువుల హ‌క్కు అని చెప్ప‌వ‌చ్చు. అయితే, ఆధునిక కాలంలో పాశ్చాత్య పోక‌డ‌ల నేప‌థ్యంలో....చాలా చోట్ల గురువుల‌పై విద్యార్థులకు గౌర‌వం త‌గ్గిపోతోంది. గ‌తంలో గురువు ఒక మాట అన్నా....ఒక దెబ్బ కొట్టినా....మ‌న మంచికే అనుకునే విద్యార్థులుండేవారు. కానీ, ప్ర‌స్తుతం....త‌మ‌ను ప‌ల్లెత్తు మాట‌న్నా త‌ట్టుకోలేనంత అహంకారపూరిత ధోర‌ణి కొంత‌మంది విద్యార్థుల‌లో క‌నిపిస్తోంది. అంతేకాదు, త‌మ‌లోని లోపాల‌ను ఎత్తిచూపి....క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండ‌మ‌ని చెప్ప‌డాన్ని కూడా విద్యార్థులు అవ‌మానంగా భావిస్తున్నారు. తాజాగా, ఇటువంటి విప‌రీత ధోర‌ణి ఉన్న ఓ విద్యార్థి(18)....ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ను పొట్ట‌న‌బెట్టుకున్నాడు. కేవ‌లం మంద‌లించిన పాపానికి ఓ నిండుప్రాణాన్ని బ‌లితీసుకున్నాడు. పెను సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న దేశంలోనే తొలిసారిగా జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.

హ‌రియాణాలోని యమునా నగర్ కు చెందిన ఓ విద్యార్థి స్వామి వివేకానంద పబ్లిక్‌ స్కూలులో 12వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి స్కూలుకు స‌రిగా హాజ‌రు కాక‌పోవ‌డంతో అటెండెన్స్ త‌గ్గింది. ఇదే విష‌యాన్ని ప్రిన్సిపాల్ రీతూ ఛాబ్రా(46)....అత‌డికి తెలియ‌జెప్పారు. అటెండెన్స్ త‌క్కువైతే సోమ‌వారం నుంచి జ‌ర‌గ‌నున్న ప్రీ బోర్డ్ ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించ‌బోన‌ని చెప్పారు. చ‌దువులో కూడా వెనుక‌బ‌డిన ఆ విద్యార్థిని....ఎక‌న‌మిక్స్ బోధించే రీతూ...విద్యార్థుల ముందే మంద‌లించేవారు. తోటి విద్యార్థుల ముందు ప‌లుమార్లు త‌న‌ను మంద‌లించ‌డాన్ని అవ‌మానంగా భావించిన ఆ విద్యార్థి....రీతూపై క‌క్షగ‌ట్టాడు. ఆమెపై ఎలాగైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావించాడు. దీంతో, ప‌థ‌కం ప్ర‌కారం....శనివారం మధ్యాహ్నం తనతో పాటు `.32 బోర్‌ గన్‌` వెంట తెచ్చుకున్నాడు. రికార్డుల‌పై ప్రిన్సిప‌ల్ సంత‌కం కావాల‌ని, ఆమెతో మాట్లాడాల‌ని చెప్పి నేరుగా రీతూ ఛాబ్రా గ‌దిలోకి వెళ్లి అక‌స్మాత్తుగా ఆమెపై కాల్పులు జ‌రిపాడు. రీతూ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. స్కూల్ సిబ్బంది....రీతూను ఆసుప‌త్రికి తరలించిన కొద్దిసేప‌టికే ఆమె మృతి చెందారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థిని స్కూలు సిబ్బంది పట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. త‌న తండ్రికి చెందిన లైసెన్స్ రివాల్వ‌ర్ ను ఇంటి నుంచి దొంగిలించిన‌ విద్యార్థి కాల్పులకు పాల్ప‌డ్డాడు. దీంతో,  ఆ విద్యార్థి తండ్రిపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్‌ తనను అంద‌రిముందు అవమానించారని, ఆమె త‌న‌ను టార్చ‌ర్ పెట్టింద‌ని, అందుకే ఆమెపై కాల్పులు జరిపానని నిందితుడు తెలిపాడ‌ని పోసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.


Tags:    

Similar News