సీఎం కుర్చీయే టార్గెట్ : పవన్ పక్కా క్లారిటీ

Update: 2022-10-18 11:38 GMT
ఏపీలో సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్ కి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటిదాకా పవన్ ఇంత స్పష్టంగా చెప్పినది లేదు. కానీ మంగళగిరిలో తాజాగా జరిగిన పార్టీ సమావేశాల్లో పవన్ తన అజెండా ఏంటో గుండె తెరచి మరి విప్పి చెప్పారు. ఏపీలో కచ్చితంగా జనసేన జెండా ఎగరాల్సిందే అంటూ పవన్ అసంఖ్యాకంగా వచ్చిన క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. దాంతో జనసేన సైనికుల నుంచి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది.

ఆయన దీనికి ముందు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ తన ప్రసంగం ఆద్యంతం ఉర్రూతలూగించారు.  ముందుగా తన మీద ప్యాకేజ్ స్టార్ ముద్రను తొలగించుకునే క్రమంలో పవన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. అంతే కాదు ఏకంగా స్టేజ్ మీదనే చెప్పి నా కొడకా చెప్పు తీసుకుని కొడతా అని పరుష వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట బూతులు మాట్లాడే వారు అయినా లేక ప్యాకేజి స్టార్ అంటూ తనను విమర్శలు చేసేవారికి అయినా ఇదే లాస్ట్ వార్నింగ్  ఇక ఎక్కడా  చెప్పేది లేదు యాక్షనే అని పవన్ చెప్పడం కూడా విశేషం.

దీని ద్వారా పవన్ అటు వైసీపీకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఇటు సొంత క్యాడర్ కి తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, తాను ఎవరి వైపు మొగ్గి లేనని, తన పార్టీ ఒక బలమైన సిద్ధాంతం మీదనే పనిచేస్తుంది అని చాటి చెప్పారు. దాంతో పవన్ మీద చాలాకాలంగా వైసీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ చేస్తూ వస్తున్న విమర్శలకు సరీన జవాబు చెప్పినట్లు అయింది. ఇదే దూకుడుతో ఆయన ఉంటే కనుక ఆయన మీద టీడీపీ నీడ కానీ ముద్ర కానీ ఉండదని జనసేన నాయకులు అంటున్నారు.

ఇక పవన్ మరో మాట కూడా చెప్పారు. ఎలక్షనీరింగ్  అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే. ఏ పార్టీకి అయినా ఓట్లు ఉంటాయి. కానీ వాటిని బూతులలో వేసుకుంటేనే లెక్క విలువ ఉంటుంది. అపుడే అధికారం దక్కుతుంది. అందువల్ల పవన్ బూత్ లెవెల్ లో తన పార్టీకి నిలబడే వారు కావాలని కార్యకర్తలను కోరారు. అలాంటి వారు ఏకంగా బూత్ లెవెల్ లో యుద్ధమే చేయాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

అంటే వచ్చే ఎన్నికల్లో ఒక వేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనుక ఆ పార్టీ తరఫున గట్టిగా నిలబడే వారు కావాలని పవన్ కోరుకుంటున్నారు అని అర్ధమవుతోంది. దీంతో కూడా పవన్ క్యాడర్ కి క్లారిటీ ఇచ్చేశారు. మీరు యుద్ధం చేస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయి. అధికారంలోకి వస్తుందని కూడా ఆయన సందేశం ఇచ్చారు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు నా ఎస్సీలు, నా మైనారిటీలు అంటూ ఆయన అణగారిన కులాలను సొంతం చేసుకుంటూ చేసిన ప్రసంగంలో కూడా సామాజిక కోణం సోషల్ ఇంజనీరింగ్ కోసం  వేస్తే కొత్త ఎత్తుగడలు కనిపిస్తున్నాయి.

అదే విధంగా తన పార్టీలో అన్ని కులాలు ఉన్నాయని పవన్ చెప్పుకున్నారు. తనకు కులం లేదని ఆయన అంటూ మరో కీలకమైన విషయం చెప్పారు. ఏపీలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు, బలిజలకు ఇప్పటిదాకా అధికారం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. దీని బట్టి పవన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటి అన్నది అర్ధమవుతోంది. అలగే ఏపీలో కేవలం ఒకటి రెండు కులాలే రాజకీయం చేస్తూ అధికారాన్ని అందుకుంటున్నాయి, ముందు కులపరమైనన వికేంద్రీకరణ కావాలని ఆయన గట్టిగా నినదిస్తున్నారు.

అంటే కాపుల నాయకత్వంలో మిగిలిన బడుగు బలహీన వర్గాలు అన్నీ ఒక గొడుగు కిందకు రావడం ద్వారా ఏపేలో మూడవ ఆల్టర్నేషన్ గా తాను రావాలని పవన్ బలంగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక పవన్ తన పాదయాత్ర గురించి కూడా చెప్పి సంచలనం రేకెత్తించారు. తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు నుంచి తన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అని పవన్ చెప్పడం విశేషం.

ఆ పాదయాత్ర ఏపీ వైపు కూడా టర్న్ అవుతుందా అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి పవన్ మార్క్ రాజకీయానికి పదును పెట్టారు. మరి ఆయన అడుగులు సొంతంగా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పడుతున్నాయా లేక పొత్తులు ఉన్నా తన అధికార వాటా సీఎం సీటు తేల్చుకునే దిశగా కార్యచరణను సిద్ధం చేస్తున్నారా అన్నది చూడాలి. మొత్తానికి చూస్తే పవన్ కచ్చితంగా సీఎం సీటునే టార్గెట్ చేశారు. సో  ఏపీ రాజకీయాల్లో పవన్ లేటెస్ట్ స్టెప్ ఇపుడు హాట్ హాట్ టాపిక్ గానే చూడాలి అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News