పోలవరం పై జగన్ అల్టిమేటం

Update: 2020-02-28 16:05 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021 జూన్ లోపు పూర్తి చేస్తామన్నారు. ఆయన ప్రాజెక్టును సందర్శించి అభివృద్ధి పనులపై అధికారులు - ఇంజినీర్లు - కాంట్రాక్ట్ సంస్థలు - స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జగన్ ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్ వే - కాఫర్ డ్యామ్ - ఎర్త్ కమ్ రాక్‌ ఫిల్ డ్యామ్ - పునరావాస కేంద్రాలు - పునరావాస ప్యాకేజీ తదితర పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు - ఇంజినీర్లకు మార్గనిర్దేశనం చేశారు.

పోలవరం ప్రాజెక్టు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఇందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి స్పిల్ వే పనులు పూర్తి కావాలన్నారు. జూన్ నుండి అక్టోబర్ మధ్య వర్షాకాలంలోను ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గవద్దన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. 2021లోపు ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకు వస్తే పంటలకు నీరు అందించవచ్చునన్నారు.

గతంలో ప్రణాళిక లోపం - సమన్వయ లోపం - సమాచారం లోపం కారణంగా పనులు వేగవంతం కాలేదన్నారు. పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టి సారించాలన్నారు. ఈ జూన్ నాటికి స్పిల్ వే పనులు పూర్తి చేయడమే కాకుండా అదే వేగంతో అప్రోచ్ ఛానల్ పూర్తి చేయాలన్నారు. స్పిల్ వే పనులు పూర్తిచేస్తే నదీ జలాన్ని దీని మీదుగా తరలించే అవకాశం ఉందని చెప్పారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేసేసరికి ముంపు పెరుగుతుందని - ఆ లోపు అక్కడి ప్రజలను తరలించాలన్నారు. కాబట్టి పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పనుల డిజైన్ల అనుమతుల్లో ఆలస్యం కాకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వీటిని ఫాలో చేసేందుకు - సత్వర అనుమతుల కోసం ఢిల్లీలో ఓ అధికారి ఉండాలన్నారు. టన్నెల్ తవ్వకం పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి మెయిన్ కెనాల్ కనెక్టివిటీ పూర్తవుతుందని - రైట్ మెయిన్ కెనాల్ టన్నెల్‌ లో లైనింగ్ కూడా పూర్తవుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు రాగా - జూన్ కల్లా నీరు పోయేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని, ఇందుకు మనకున్న అడ్డంకులు, సమస్యలు ఏమిటో గుర్తించాలన్నారు.
Tags:    

Similar News