సీఎం జగన్ కు ఊరట.. కోర్టు హాజరుపై మినహాయింపు

Update: 2019-06-08 07:38 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆయనకు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం జగన్ తనపై నమోదైన సీబీఐ కేసులకు ప్రతి శుక్రవారం విచారణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విధుల నిర్వహణలో భాగంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్టు జగన్ తరుఫు న్యాయవాది అశోక్ రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు.

జగన్ లాయర్ అశోక్ రెడ్డి తాజాగా నాంపల్లి సీబీఐకోర్టులో సీఆర్పీఎస్ సెక్షన్ 317 కింద పిటీషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా హాజరు నుంచి విముక్తి కల్పించాలని కోర్టులో విన్నవించారు.

వైసీపీలోని కీలక వ్యవహారాలు.. ప్రభుత్వ పాలనలో భాగం పంచుకున్న కారణంగా తాను తాడేపల్లిలోని ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున తనకు కూడా హాజరు నుంచి మినహాయింపు కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టుకు లాయర్ ద్వారా విన్నవించారు. ఈ వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు ఈ రెండు పిటీషన్లను అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది.

జగన్ పై సీబీఐ ఇదివరకు భారతి సిమెంట్స్, వాన్ పిక్, దాల్మియా సింమెంట్ వంటి అనేక కేసుల్లో 11 చార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ కేసులన్నింటిపై విచారణ సాగుతోందని.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరుఫు లాయర్ పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎంగా జగన్ బిజీగా ఉంటారని.. విజయసాయిరెడ్డి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్షిస్తుంటారని పిటీషన్ లో పేర్కొన్నారు. చాలా మందికి హాజరు మినహాయింపునిచ్చారని.. తమను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణకు 21కు వాయిదావేసింది.

    
    
    

Tags:    

Similar News