హోంమంత్రిని పట్టించుకోని కమిషనర్.!?

Update: 2019-07-20 07:08 GMT
దాదాపు పదేళ్లవుతోంది. గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగకపోవడంతో  అక్కడ అధికారుల రాజ్యం నెలకొంది. వారు ఏది చేస్తే అదే చట్టం. ఇక గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనిచేయలేదని ఎన్నో ఆరోపణలున్నాయి.  కానీ బాబు పట్టించుకోకపోవడంతో వారంతా అలానే తిష్టవేశారని స్థానికులు చెబుతుంటారు.

కాగా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కార్పొరేషన్ పై పట్టుకోసం వైసీపీ నేతలు కూడా పట్టుబడుతున్నారు. కానీ అధికారులు మాత్రం వినడం లేదట..  ఇక తాజాగా గుంటూరు కార్పొరేషన్ లో అంతర్గత బదిలీలు మొదలయ్యాయట.. బాగా రెవెన్యూ ఉండే పోస్టుల కోసం అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలతో లాబీయింగ్ మొదలుపెట్టారట.. మున్సిపల్ మంత్రి బొత్స, హోంమంత్రి సుచిరితలను కలుస్తూ ఉద్యోగులు బాగా రెవెన్యూ ఉండే సిటీ ప్లానర్- బిల్డింగ్ ఇన్ స్పెక్టర్లు- శానిటరీ ఇన్ స్పెక్టర్ల పోస్టుల కోసం ఎగబడుతున్నారట..

తాజాగా గుంటూరు కార్పొరేషన్ లోనే తిష్టవేసిన పనిచేయని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి మంత్రి సుచరిత కుటుంబసభ్యుల ద్వారా అదే పోస్టింగ్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టారట.. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ హోంమంత్రి సుచిరిత సంప్రదించగా.. సదురు అధికారికి తిరిగి పోస్టింగ్ పై విముఖత వ్యక్తం చేశారట.. కమిషనర్ ఐఏఎస్ కావడంతో సుచిరిత ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా హోంమంత్రి సిఫారసునే మున్సిపల్ కమిషనర్ పక్కనపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హోంమంత్రి అసలు అధికారుల పైరవీల్లో ఇరుక్కోవడం పెద్ద తప్పు. ఆ విషయం సదురు కమిషనర్ రిజెక్ట్ చేయడంతో విషయం కాస్తా లీక్ అయ్యి జగన్ వరకు వెళ్లినట్టు తెలిసింది. ఇలా గుంటూరు కార్పొరేషన్ ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.


Tags:    

Similar News