కాంగ్రెస్ ఇప్పుడో లాఫింగ్ క్ల‌బ్ అన్న మోడీ

Update: 2017-11-02 09:33 GMT
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌ముఖ పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు ఈ రెండు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న‌ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గుజ‌రాత్ లో ప‌ర్య‌టించి మోడీ స‌ర్కారు తీరుపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌ధాని మోడీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు లాఫింగ్ క్లబ్ గా మారిందంటూ చుర‌క‌లు వేశారు. చిన్న పిల్లాడు సైతం ఈ రోజు కాంగ్రెస్ చెప్పే హామీల్ని విశ్వ‌సించ‌టం లేదంటూ ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. అవినీతి.. అస‌హ‌నం లాంటి అంశాల మీద కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు.

క‌శ్మీర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత చిదంబ‌రం చేసిన వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన మోడీ.. కాంగ్రెస్ విధానాల్ని త‌ప్పు ప‌ట్టారు. అధికార‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ కార‌ణంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం లూటీకి గురైంద‌ని.. ఓటుతో వారికి శిక్ష విధించాలంటూ ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ నెల 9న జ‌రిగే పోలింగ్ లో కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చే అవ‌కాశాన్ని ఓటుతో ఎంత‌మాత్రం మిస్ చేసుకోవ‌ద్దంటూ మోడీ పిలుపునిచ్చారు. పోలింగ్ జ‌రిగిన నెలా ప‌ది రోజుల‌కు ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మొద‌ట హిమాచ‌ల్ ప్ర‌దేశ్  ఎన్నిక‌లు పూర్తి అవుతాయి. త‌ర్వాత గుజ‌రాత్ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. ఒకేసారి ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.
Tags:    

Similar News