కాంగ్రెస్ నాయకుడి కోడి టీఆరెస్ లో చేరింది..

Update: 2017-01-10 12:55 GMT
ప్రకృతి పరంగా జరిగే వింతలు ఒక్కోసారి భలే సరదాగా... ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతుంటాయి. తాజాగా హైదరాబాద్ శివారుల్లోని ఓ రాజకీయ నాయకుడికి ఇలాంటి ఇరకాటమే వచ్చిపడిందట.  పాపం... ఆయన తప్పేమీ లేకపోయినా, ఆయన కోడి పెట్టిన గుడ్డు ఆయన్ను టాక్ ఆఫ్ ద సిటీగా మార్చేసి, చివరకు అన్ని పార్టీలవారూ ఆయన గురించి చర్చించుకునేలా చేసింది.
    
హయత్ నగరం మండలం రాగన్నగూడకు చెందిన సామ భీంరెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఇంట్లో ఒక కోడి పెంచుతున్నారు. అందులో వింతేమీ లేకపోయినా అది ఒక వింత గుడ్డు పెట్టడం ఇప్పుడు చర్చనీయమైంది. ఆ కోడి పెట్టిన గుడ్డును ఉడకబెడితే అది గులాబీ రంగులో ఉందట. భీంరెడ్డేమో కాంగ్రెస్ లీడరాయె.. ఆయన కోడేమో గులాబీ గుడ్డు పెట్టింది. ఇంకేముంది.. ఆయన ఈ సంగతి చెప్పగానే ఊళ్లో వాళ్లంతా ఆయన్ను సరదాగా ఆటపట్టించడం మొదలుపెట్టారట. ముఖ్యంగా టీఆరెస్ లీడర్లయితే.. ‘‘ఏం భీం రెడ్డన్నా... నువ్వు మా పార్టీలోకి రాకున్నా.. నీ కోడి మాత్రం వచ్చేసిందన్నా’’ అంటున్నారట.
    
అంతేకాదు.. కాంగ్రెస్ లీడర్ కోడి టీఆరెస్ గుడ్డు పెట్టిందంటూ కుర్రకారు ఈ ఇష్యూను సోషల్ మీడియాకు కూడా ఎక్కించేశారు. భీంరెడ్డి మాత్రం ఇదంతా సరదాగా తీసుకుంటూ నా కోడి పార్టీ మారినా నేను మాత్రం మారబోనని నవ్వుతూ అంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News